Kodad BRS : కోదాడ బీఆర్ఎస్ లో రాజీనామాల కుదుపు
Kodad BRS : అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు కత్తిమీద సాములా మారాయి. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు వరుసగా రాజీనామాల బాటపట్టారు. తాజాగా కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కుండవాలు కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.
Kodad BRS : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే నాగార్జున సాగర్ లో దాదాపు అన్ని మండలాల్లో పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పుడు మరో నియోజకవర్గం కోదాడ వంతు వచ్చింది. ఇక్కడి నాయకులు సైతం గులాబీ కండువాలు పక్కన పడేసి.. కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.
అభ్యర్థిని మార్చనందుకు తిరుగుబాటు
కోదాడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కే ఈసారి కూడా టికెట్ ఇచ్చారు. టికెట్లు ప్రకటించిన రోజు నుంచే ఇక్కడి నాయకులు ఆయన టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైకమాండ్ ను కలిసి ఎమ్మెల్యేకే టికెట్ ఇస్తే తాము పనిచేయలేమని తేల్చి చెప్పారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. ఎవరైనా బీసీ నాయకుడికే టికెట్ ఇచ్చినా తామంతా కలిసి పనిచేసి గెలిపించుకుంటాం కానీ, బొల్లం మల్లయ్య యాదవ్ ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. కానీ, గులాబీ అగ్ర నాయకత్వం వీరి విన్నపాలను పట్టించుకోలేదు. సరికాదా ఇటీవలే బొల్లం మల్లయ్య యాదవ్ కు బి-ఫారం కూడా అందజేసింది. దీంతో ఇక లాభం లేదని ఈ నాయకులంతా బహిరంగంగానే తిరుగుబాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, ఉద్యమ నాయకుడు కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పాండురంగారావు, నియోజకవర్గ నాయకులు మహ్మద్ జానీ, ఎర్నేని బాబు, వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు రాజీనామాల బాటపట్టారు.
అసలు గొడవ ఏమిటి ?
తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి కన్మంత శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయనకు 2014లో టికెట్ ఇచ్చినా ఓటమి పాలయ్యారు. దీంతో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకత్వం కొత్త నాయకత్వం కోసం వెదికింది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన బొల్లం మల్లయ్య యాదవ్ ను చివరి నిమిషంలో తీసుకువచ్చి టికెట్ ఇచ్చింది. 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ రూపంలో బీఆర్ఎస్ తొలిసారి కోదాడలో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అన్ని వర్గాల నాయకులు కలిసి పనిచేశారు. కానీ, ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత బొల్లం మల్లయ్య యాదవ్ తమకు సరిగా పట్టించుకోలేదని, అణగదొక్కే ప్రయత్నాలు చేశారని, చివరకు సభ్యత్వాలు కూడా ఇవ్వలేదన్న విమర్శలు ఈ నాయకులు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మారారు. కోదాడ మున్సిపాలిటీలో రాజకీయాలు కూడా వివాదాస్పదం అయ్యాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ మీడియా ముందు ఎమ్మెల్యే వేధింపులకు పాల్పడుతున్నారంటే కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం రేపింది. ఈ పరిస్థితులల్లో ఎన్నికలు దగ్గర పడడంతో వీరంతా అవకాశం కోసం కాచుక్కూర్చుని బొల్లం మల్లయ్యకు టికెట్ ఇవ్వొద్దన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.
టికెట్ ఆశించిన శశిధర్ రెడ్డి
పార్టీ నాయకుడు కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి ఈ సారి టికెట్ ఆశించారు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో ఆయన అలకబూని ఇండిపెండెంటుగానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ అగ్రనాయకత్వం పిలిపించి మాట్లాడినా అంగీకరించలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న తనకు కనీస గుర్తింపు లేదన్న ఆగ్రహం ఆయనలో ఉంది. జిల్లా నాయకత్వం కూడా తనను సరిగా పట్టించుకోలేదని, 2014 లో తనకు టికెట్ ఇవ్వకున్నా.. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేర్చి, పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి శ్రమించానని ఆయన పేర్కొంటున్నారు. ఈ సారి ఎమ్మెల్యేకు ఎదురుగాలి వీస్తోందని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోతుందని, అభ్యర్థిని మార్చాలని చేసిన డిమాండ్ గురించి హైకమాండ్ నుంచి కనీస స్పందన లేదన్నది ఆయన వాదనగా ఉంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొడతామంటూ శనివారం వీరంతా పార్టీకి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్ తిరుగుబాటు నాయకులతో ఉత్తమ్ భేటీ
మరో వైపు బీఆర్ఎస్ లో రగులుతున్న అసమ్మతిని వాడుకునేందుకు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిని వ్యక్తిగతంగా కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి పోటీ చేయనున్నారు. వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆదివారం కాంగ్రెస్ కండువాలు కప్పుకునే వీలుంది. వీరిలో వేనేపల్లి చందర్ రావు సుదీర్ఘకాలం కోదాడ ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాయకుడు. మహ్మద్ జానీ 2009 లో కాంగ్రెస్ తరపున కోదాడ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన నాయకుడు. ఎర్నేని బాబు గతంలో కోదాడ సర్పంచిగా పనిచేసి సీనియర్ నేత. శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు. పాండురంగారావు ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా పనిచేసిన నేత. వీరే కాకుండా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం చర్చనీయాంశం అయ్యింది.