Rajanna Sircilla Police : గంజాయి సేవిస్తున్నారా..? అందుబాటులోకి చెకింగ్ 'కిట్స్', ఈజీగా దొరికేస్తారు..!
Kits to Detect Drug Consumption : గంజాయి సేవించే వారిని పట్టుకునేందుకు సరికొత్త వ్యవస్థ వచ్చేసింది. బ్రీత్ అనలైజర్ మాదిరిగా ఉండే కిట్స్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని అన్ని పోలీసు స్టేషన్లలో ఉంచారు.
Kits to Detect Drug Consumption : గంజాయి, డ్రగ్స్ ను సమూలంగా అరికట్టేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ మాదిరిగా గంజాయి టెస్ట్ కిట్ లను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. తొలి రోజే 8 మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…. అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, సిరిసిల్ల టౌన్ సి.ఐ లతో కలసి గంజాయి టెస్ట్ కిట్ల ను ఆవిష్కరించారు. గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగే వారిని పట్టుకోవడం జరుగుతుందన్నారు.
తస్మాత్ జాగ్రత్త..
గంజాయి రహిత జిల్లాగా మార్చడాని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.
గంజాయి మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే గాని వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ఈ నేపధ్యంలో తెలంగాణ పోలీస్ గంజాయి తాగే వారిని గుర్తించడానికి అన్ని పోలీస్ స్టేషన్లలోకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకవచ్చామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే,గంజాయి టెస్ట్ లు నిర్వహించి వాటికి బానిసైన వారిని పట్టుకోవడం జరుగుతుదన్నారు. జిల్లాలో గంజాయి సేవించేవారు ఇకనుంచి పోలీసుల చేతిలో తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో గతంలో గంజాయి కేసులల్లో నిందితులుగా ఉన్న వారు వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా అని పరిశీలించడం జరుగుతుందన్నారు. అనుమాస్పదంగా తిరుగుతు కనపడిన వారిని సిరిసిల్ల, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట్, గంభీరవుపేట్ పోలీస్ స్టేషన్లలో గంజాయి కిట్స్ తో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన వారిని, వారికి గంజాయి సరఫరా చేసిన వారిని 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 390 గ్రాముల గంజాయి,05 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వివరించారు.
ఈ ఏడాది ఇప్పటికే 50 కేసులు.. 150 మంది అరెస్టు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 50 గంజాయి కేసులు నమోదు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆ కేసులకు సంబంధించి 150 మందిని అరెస్టు చేసి 32 కేజీల వరకు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఇక నుంచి ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరిగానే గంజాయి టెస్టులు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.