Ponguleti Jupally : కర్ణాటక ఫలితాలతో క్లారిటీ- పొంగులేటి, జూపల్లి ఊగిసలాటకు తెరపడుతుందా?
Ponguleti Jupally : కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని సమాచారం.
Ponguleti Jupally : కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందో లేదో గానీ, బీజేపీ చేరికలపై కచ్చితంగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లు బీజేపీ వైపు చూసిన నేతలు కాస్త ఆలోచిస్తారంటున్నారు. కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెంచింది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫలితాలు చూపించి చేరికలు పెంచాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు కాస్త డౌట్ తో పార్టీలో చేరేందుకు ఆలోచించిన నేతలను మళ్లీ ట్రాక్ పెట్టాలని టి. కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అసంతృప్తి నేతలు ఇప్పుడు కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తాయని ఆ పార్టీలు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం మరింత పెరిగిందంటున్నారు.
పొంగులేటి, జూపల్లికి క్లారిటీ
ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లిని తమ పార్టీల్లోకి ఆహ్వానించాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరాలని దిల్లీ నుంచి రాహుల్ గాంధీ టీమ్ వచ్చి పొంగులేటితో ఈ మధ్య చర్చలు కూడా జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో రెండు మినహా మిగిలిన ఎనిమిది సీట్లు పొంగులేటి సూచించిన అభ్యర్థులకు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ పావులు కదపడంతో బీజేపీ చేరికల కమిటీ కూడా రంగంలోకి దిగింది. ఈటల రాజేందర్ నేతృత్వంలో ఓ బృందం పొంగులేటి, జూపల్లితో ఇటీవల ఖమ్మంలో చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది సీట్లు పొంగులేటికే ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అధిష్ఠానం నుంచి స్పష్టత రాకపోయేసరికి ఇద్దరు నేతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఏ పార్టీలో చేరినా తాము చెప్పిన అభ్యర్థులకే సీట్లు ఇవ్వాలని ఆ ఇద్దరు నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం.
హస్తం పార్టీలోకే!
కొంత కాలంగా ఏ పార్టీలో చేరాలో ఎలాంటి నిర్ణయం తీసుకోని పొంగులేటి, జూపల్లికి కర్ణాటక ఎన్నికలతో క్లారిటీ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. సేవ్ వనపర్తి పేరుతో పొంగులేటి, జూపల్లి ఇవాళ నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తమ రాజకీయ భవిష్యత్ పై స్పష్టత ఇస్తారని అనుచరులు అంటున్నారు. ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరికపై ప్రకటన చేస్తారని సమాచారం. తెలంగాణ అవతరణ రోజైన జూన్ 2న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కర్ణాటక ఎన్నికల్లో విజయంతో ఈ నేతలు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉండడంతో పొంగులేటి, జూపల్లి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని వీరి అనుచరులు అంటున్నారు. అయితే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద బలం వచ్చినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.