Water Heater Shock : సెల్ ఫోన్ మాట్లాడుతూ చంకలో వాటర్ హీటర్, ఖమ్మంలో ప్రాణాలు కోల్పోయిన చిరు వ్యాపారి-khammam person got electric shock mistakenly put water heater in under arm taking to phone ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Water Heater Shock : సెల్ ఫోన్ మాట్లాడుతూ చంకలో వాటర్ హీటర్, ఖమ్మంలో ప్రాణాలు కోల్పోయిన చిరు వ్యాపారి

Water Heater Shock : సెల్ ఫోన్ మాట్లాడుతూ చంకలో వాటర్ హీటర్, ఖమ్మంలో ప్రాణాలు కోల్పోయిన చిరు వ్యాపారి

HT Telugu Desk HT Telugu
Aug 12, 2024 05:40 PM IST

Water Heater Shock : చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీసింది. వాటర్ హీటర్ ఆన్ చేసి ఫోన్ వచ్చిన హడావుడిలో....హీటర్ చంకలో పెట్టుకున్నాడో వ్యక్తి. కరెంట్ షాక్ కొట్టి అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.

సెల్ ఫోన్ మాట్లాడుతూ చంకలో వాటర్ హీటర్, ఖమ్మంలో ప్రాణాలు కోల్పోయిన చిరు వ్యాపారి
సెల్ ఫోన్ మాట్లాడుతూ చంకలో వాటర్ హీటర్, ఖమ్మంలో ప్రాణాలు కోల్పోయిన చిరు వ్యాపారి

Water Heater Shock : సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడమే కాదు.. ఫోన్ చెవిలో పెట్టుకుని ఏ పని చేసినా అందులో ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పడానికి ఖమ్మంలో చోటుచేసుకున్న ఈ ఘటన చక్కటి ఉదాహరణ. వాటర్ హీటర్ తో నీళ్లు కాచుకునేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి సెల్ ఫోన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. కాల్వడ్డు ప్రాంతానికి చెందిన దోనపూడి మహేష్ బాబు(40) తొమ్మిది సంవత్సరాలుగా కొబ్బరి కాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆదివారం రాత్రి తన ఇంట్లో ఉన్న కుక్క పిల్లకు స్నానం చేయించే క్రమంలో వేడి నీళ్లు కాక పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాటర్ హీటర్ తో నీళ్లు కాచుకునేందుకు బకెట్లో నీళ్లు పెట్టి వాటర్ హీటర్ పెట్టేందుకు యత్నించాడు. సరిగ్గా ఇదే సమయంలో అతని ఫోన్ మోగింది. దీంతో సెల్ ఫోన్ చెవిలో పెట్టుకొని వాటర్ హీటర్ స్విచ్ ఆన్ చేసి దానిని బకెట్లో పెట్టకుండా ఏమరుపాటుగా చంకలో పెట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి విలవిల్లాడాడు.

ఎంత ప్రయత్నించినా ప్రాణాలు దక్కలే

తన తండ్రికి కరెంట్ షాక్ కొట్టిన విషయాన్ని గమనించిన కూతురు వెంటనే బయటికి వచ్చి చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. దీంతో స్పందించిన స్థానికులు అతడిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీపీఆర్ తో పాటు కాళ్లు, చేతులు రుద్ది ప్రాణాలు కాపాడేందుకు శ్రమించారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకువెళుతుండగానే మహేష్ ఊపిరి కోల్పోయాడు. మహేష్ కు 9 సంవత్సరాల కిందట వివాహమైంది. ఒక కుమార్తె ఉంది. కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటూ భార్య, కూతుర్ని పోషిస్తున్నాడు. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో మహేష్ ప్రాణాలు కోల్పోవడంతో భార్య దుర్గాదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కేవలం సెల్ ఫోన్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుని మహేష్ తన నిండు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనతో స్థానికులు నిర్ఘాంతపోయారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి

సంబంధిత కథనం