Congress Khammam Meeting : ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం, కీలకంగా మారిన కాంగ్రెస్ సభ!-khammam congress public meeting on july 2nd bhatti vikramarka padayatra ending rahul gandhi attends ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Khammam Meeting : ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం, కీలకంగా మారిన కాంగ్రెస్ సభ!

Congress Khammam Meeting : ఖమ్మం చుట్టూ తెలంగాణ రాజకీయం, కీలకంగా మారిన కాంగ్రెస్ సభ!

Bandaru Satyaprasad HT Telugu
Jul 01, 2023 08:34 PM IST

Congress Khammam Meeting : ఖమ్మంలో ఆదివారం జరిగే కాంగ్రెస్ జనగర్జన సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. ఖమ్మంలో సభలో కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు.

కాంగ్రెస్
కాంగ్రెస్

Congress Khammam Meeting : ఖమ్మంలో జరిగే జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. ఎన్నికల వేళ తెలంగాణ వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. తెలంగాణలో అధికారానికి దగ్గరయ్యామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ కాంగ్రెస్ ప్లేస్ ను బీజేపీ భర్తీ చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ లో కనిపించే అంతర్గత కుమ్ములాటలు.. ఇప్పుడు బీజేపీలో నేతల మధ్య మొదలయ్యాయి. బీజేపీ నేతలు బహిరంగంగానే హైకమాండ్ పై విమర్శలు చేస్తున్నారు. బయటకు ఎన్ని తిట్టుకుంటున్నా... అవసరానికి కాంగ్రెస్ నేతలు ఏకమవుతున్నారు. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఖమ్మంలో భారీ బహిరంగ సభ

సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఆదివారంతో భట్టి పాదయాత్ర ముగియనుంది. దీంతో పాదయాత్ర ముగింపు వేళ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్‌ గాంధీ ఘనంగా సత్కరించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకుంటూ... పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల్లో జోష్ నింపుతూ, కేడర్ లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు భట్టి. పాదయాత్రపై అందిన నివేదికలతో రాహుల్ గాంధీ భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. భట్టి పాదయాత్ర ముగింపు సభ, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేశారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. ఈ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు.

ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం

అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో గందరగోళం కొనసాగుతోంది. బీజేపీ కీలక నేతలే పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని అంటున్నారు. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. పార్టీ నాయకత్వం మార్పుపై హైకమాండ్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ పాల్గొనడంతో... బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపుపడింది. కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకోవటంతో రాష్ట్ర బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఖమ్మం సభకు అవాంతరాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఆరోపణలుచేస్తుంది. ఎవరు ఎన్ని అడ్డంకుల సృష్టించిన ఖమ్మం సభను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది.

Whats_app_banner