Congress Leaders : ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతల కుమ్ములాట, నెట్టింట వీడియోలు వైరల్!-khammam congress janagarjana meeting leader fight to show placards along with rahul gandhi videos viral ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Leaders : ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతల కుమ్ములాట, నెట్టింట వీడియోలు వైరల్!

Congress Leaders : ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతల కుమ్ములాట, నెట్టింట వీడియోలు వైరల్!

Bandaru Satyaprasad HT Telugu
Jul 03, 2023 02:35 PM IST

Congress Leaders : తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ముందే కుమ్ములాడుకున్నారు. ఆదివారం జరిగిన జనగర్జన సభలో ఫొటోలకు ఫోజులిచ్చే సమయంలో ఒకరినొకరు తోసుకున్నారు.

ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతలు
ఖమ్మం సభలో కాంగ్రెస్ నేతలు

Congress Leaders : తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎక్కడున్నా, ఏం చేసినా సంచలనమే. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, పొంగులేటి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నందుకు ఆ పార్టీ ఆదివారం ఖమ్మంలో జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట మరోసారి బహిర్గతం అయింది. రాహుల్ గాంధీ ఉండగానే స్టేజ్ పై కాంగ్రెస్ నేతలు ఒకనొకరు తోసేసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సభ ముగింపు సమయంలో రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు రూ.4 వేల పింఛన్ అంటూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. రాహుల్ గాంధీతో స్టేజ్ ప్లకార్డు ప్రదర్శించేందుకు వారంతా పోటీపడ్డారు. ఈ సమయంలో భట్టి విక్రమార్కను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మోచేతితో నెట్టేశారు. మరో వ్యక్తి వీరి మధ్య వచ్చేందుకు ప్రయత్నిస్తే ఆయనను అడ్డుకున్నారు. వేదికపై ప్లకార్డు చూపిస్తున్న సమయంలో కోమటి రెడ్డి, భట్టి విక్రమార్క ఈ తోపులాట జరిగింది. కోమటిరెడ్డిని పక్కకు జరగాలని భట్టి కోరారు. ఇంతలో వెనుక నుంచి మరో నేత నెట్టుకుంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కోమటి రెడ్డి తన మోచేతితో భట్టి విక్రమార్కను గట్టిగా నెట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత వెనుక ఉన్న నేతకు కోమటి రెడ్డి వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది కాంగ్రెస్ నాయకత్వం ఐక్యత అంటూ నెటిజన్ల సెటైర్లు వేస్తున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా...

కర్ణాటకలో నేతలు విభేదాలు పక్కన పెట్టి పార్టీకి విజయం అందించారని, అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు పనిచేయాలని ఇటీవల అధిష్ఠానం నేతలకు వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పాటుపడాలని హైకమాండ్ సూచించింది. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత అంతంత మాత్రమే అనేది మరోసారి రుజువైంది. ఏకంగా రాహుల్ గాంధీ ముందే నేతలు ఒకరినొకరు తోసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోలతో బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఐక్యత అంటూ సెటైర్లు వేస్తున్నాయి. ముందు తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ ఒకరికి ఒకరు సక్కగా నిలబడడానికి చేయూత ఇచ్చుకోండని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బండి సంజయ్ ఎద్దేవా

కాంగ్రెస్ నేతల కమ్ములాటలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఎదురుగా స్టేజీపై పోరాడుతున్న వీళ్లు..కాంగ్రెస్‌లో చేరాలని, తెలంగాణలో ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలను కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు లీడర్‌లను సరఫరా చేయడం దుకాణం అని విమర్శించారు. మొదటి టర్మ్‌లో - 1/3 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు, రెండవసారి - 2/3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు BRS లో చేరారని విమర్శించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు అవసరమైతే క్యాష్ రిచ్ కేసీఆర్ వారందరినీ టీపీసీసీ దుకాణం నుండి కొనుగోలు చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియాలో ట్వీట్ చేశారు.

Whats_app_banner