KCR Aurangabad Meeting: ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారం కావన్న కేసీఆర్-kcr said that if people do not question the problems in the country there will be no solution ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Aurangabad Meeting: ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారం కావన్న కేసీఆర్

KCR Aurangabad Meeting: ప్రశ్నించకపోతే సమస్యలు పరిష్కారం కావన్న కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Apr 24, 2023 08:22 PM IST

KCR Aurangabad Meeting: దేశంలో, పౌర సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, దేశంలో తక్షణ మార్పు రావాల్సిన అవశ్యకత ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మారితే తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాదని కేసీఆర్ చెప్పారు.

ఔరంగాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడుతున్న కేసీఆర్
ఔరంగాబాద్‌ బహిరంగ సభలో మాట్లాడుతున్న కేసీఆర్

KCR Aurangabad Meeting: దేశానికి ప్రస్తుతం ఏదైనా లక్ష్యం ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఔరంగాబాద్‌లో బిఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. లక్ష్య రహితంగా దేశం ముందుకు సాగుతోందని, దీనిపై దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం లక్ష్య రహితంగా సాగుతోందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు గడిచినా ప్రజల జీవితాల్లో ఎందుకు మార్పు రాలేదని కేసీఆర్ ప్రశ్నించారు.

ఔరంగాబాద్‌, అకోలా వంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. దేశంలో నదుల్లో పుష్కలంగా నీరు ఉన్నా ఇంకా దేశ ఆర్ధిక రాజధానికి సమీపంలో ఉన్న ఔరంగాబాద్‌లో నీటి ఎద్దడి ఎందుకు ఉందో ప్రజలు ఆలోచించుకోవాల్సి ఉందన్నారు. లక్షల మంది ఉపాధి లేకుండా ఎందుకు ఉండాల్సి వస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు. పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని, ధనికులు మరింత ధనికులు అవుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలో ఈ పరిస్థితికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలన్నారు.

దేశంలో యువశక్తి పుష్కలంగా ఉన్నా వారికి కావాల్సిన అవకాశాలు మాత్రం లభించడం లేదన్నారు. రైతులు ఏటా పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా వాటిని అరికట్టేందుకు ఎలాంట చర్యలు తీసుకోవడం లేదని కేసీఆర్ ఆరోపించారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, దేశంలో తక్షణ మార్పు అవశ్యకత ఉందన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు మారితే మార్పు రాదని కేసీఆర్ చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినపుడే పురోభివృద్ది సాధ్యమవుతుందన్నారు. దేశ ప్రజలందరి అభివృద్ధి కోసం బిఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ చెప్పారు.

ఔరంగాబాద్‌లో బిఆర్‌ఎస్‌ పార్టీకి శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. నీరు, విద్యుత్ వంటి సమస్యలను ఎందుకు పరిష్కరించ లేకపోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా వాటిని ఎందుకు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని ప్రశ్నించారు. దేవుడిపై భారం వేసి వదిలేశారని కేసీఆర్ విమర్శించారు. పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా వాటిని ఎందుకు వృధా చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్న సమయంలో అబ్ కీ బార్.. కిసాన్ స‌ర్కార్ అనే నినాదాల‌తో సభా ప్రాంగ‌ణం మార్మోగింది.బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఔరంగాబాద్ బ‌య‌ల్దేరారు. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో కేసీఆర్ ఔరంగాబాద్‌కు వెళ్లారు. మ‌హారాష్ట్రలో గ‌తంలో నాందేడ్, కంధార్ లోహాలో బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించింది. తాజాగా ఔరంగాబాద్‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఔరంగాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట ఎంపీలు కేశ‌వ‌రావు, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు మ‌ధుసూద‌నాచారి, దేశ‌ప‌తి శ్రీనివాస్, క‌డియం శ్రీహ‌రి, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఉన్నారు.విమానాశ్రయం నుంచి ఔరంగాబాద్ మాజీ ఎమ్మెల్యే అభ‌య్ పాటిల్ ఇంటికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఆయ‌న నివాసం వ‌ద్ద కేసీఆర్‌కు అపూర్వ స్వాగ‌తం ల‌భించింది. విమానాశ్ర‌యం నుంచి నేరుగా కైలాష్ పాటిల్ ఇంటికి చేరుకున్నారు. గ‌తంలో వైజాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు అభ‌య్ పాటిల్ నివాసంలో స్థానిక నేతలతో ముచ్చటించారు.

IPL_Entry_Point