Karimnagar Smartcity: 80 శాతం పూర్తైన కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు, పనుల పూర్తికి మరో 9 నెలల గడువు
Karimnagar Smartcity: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి.
Karimnagar Smartcity: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు అధికారుల అలసత్వం పాలకుల పట్టింపులేని దోరణితో వ్యవహరించడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 31న స్మార్ట్ సిటీగా ఎంపిక చేసింది.
కేంద్ర, రాష్ట్ర - ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.936 కోట్లు కేటాయించారు. 2018లో పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు రూ.745 కోట్లు చెల్లింపులు కాగా, మరో రూ.191 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.30కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు కలిపి రూ.60 కోట్లు నగరానికి విడుదల చేయాల్సి ఉంది. ఆరేళ్ళ లో 80 శాతం పనులు పూర్తి చేశారు. ఇంకా 20 శాతం పనులు పూర్తి కావాలంటే మరెన్ని సంవత్సరాలు పెడుతుందో అని నగర ప్రజలు భావిస్తున్నారు.
2025 మార్చి డెడ్ లైన్..
స్మార్ట్ సిటీ పనులు రాబోయే 2025 మార్చిలోగా పూర్తి చేయాలని కేంద్రం వెసులుబాటు కల్పించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ గడువు జూన్30 తో ముగియగా, ఈ గడువును మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు పొడిగింపుతో వందశాతం పనులు పూర్తి చేసే పనిలో అధికారులు పాలకులు నిమగ్నమయ్యారు.
ప్రస్తుతం ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు, కూడళ్లు, పార్క్ లు సమీకృత మార్కెట్లు, దోభీఘాట్లు, కమాండ్ కంట్రోల్ భవనం తదితర నిర్మాణాలు చేపట్టారు. పద్మనగర్, కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ల పనులు కొనసాగుతున్నాయి. కాశ్మీర్ గడ్డ మార్కెట్ పనులు వారం క్రితం ప్రారంభమయ్యాయి. కమాండ్ కంట్రోల్ భవన పనులు కొనసాగుతున్నాయి. హౌసింగ్ బోర్డు కాలనీలోనూ డ్రైనేజీల కనెక్టివిటీ, టైల్స్, స్మార్ట్ స్ట్రీట్ లైట్ల విద్యుత్ కనెక్షన్, హెచ్.ఆర్ జంక్షన్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది.
స్మార్ట్ పనులపై పిర్యాదుల వెల్లువ..
నిధులు సకాలంలో విడుదల కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వాటాను జమచేయక పోవడం, అక్రమాలు చోటుచేసుకోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధికార విపక్షాల మద్య విమర్శలతో వందశాతం పనులు పూర్తికాలేకపోయాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 30తో స్మార్ట్ సిటీ పనులు వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది.
కరోనాతో రెండేళ్ల పాటు పనులు వేగంగా చేయలేకపోయిన కారణంగా గడువు పొడిగించాలంటూ పలువురు కోరుతూ వచ్చారు. గతంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మరో తొమ్మిది నెలలు గడువు పెంచడంతో, నగరంలో స్మార్ట్ సిటీ పనులు వందశాతం పూర్తయ్యే అవకాశం లభించింది.
స్మార్ట్ సిటీ అవకతవకలపై విచారణ జరపాలి
దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయడానికి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ నగరాలు పూర్తిస్థాయి లో అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
స్మార్ట్ సిటీ నిధులను విడుదలకు తాను మూడుసార్లు లేఖ రాశానని గుర్తుచేశారు. గత పాలకులు కమీషన్లకు కక్కుర్తితోనే స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. స్మార్ట్ సిటీ నిధుల అవకతవకలు, కమీషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రికి మేయర్ కృతజ్ఞతలు..
స్మార్ట్ సిటీ మిషన్ గడువును పెంచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా ఎంపీ బండి సంజయ్ కి మేయర్ వై సునీల్ రావు కృతజ్ఞతలు తెలిపారు. పెంచిన గడువుతో అన్ని రకాల సదుపాయలు సమకూరుతాయని తెలిపారు.
మిగిలిన 20శాతం పనులు పూర్తి చేసి, నగరాన్ని సుందరనగరంగా అభివృద్ధి లో అగ్రగామిగా నిలుపుతామన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ నగర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకురావడంలో పూర్తి సహకారం అందించాలని కోరారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి, హెచ్‌టి తెలుగు, ఉమ్మడి కరీంనగర్)