Karimnagar Smart City Project : స్మార్ట్ సిటీ నిధులు గోల్ మాల్..! కమిషనర్ తో సహా ముగ్గురిపై కేసు నమోదు
కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం రాజకీయంగా దుమారం రేపుతుంది. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హై కోర్టును ఆశ్రయించడంతో మున్సిపల్ అధికారులపై కేసు నమోదు అయింది. హైకోర్టు ఆదేశంతో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్ఈ, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ఎండీపై FIR చేశారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. స్మార్ట్ సిటీ నిధులు దారి మళ్ళీంచ్చారు. తిలా పాపం తల పిడికెడు అన్నట్లు పంచుకుతిన్నారు. ఎన్నికల ముందు అభివృద్ధి జపంతో అదరగొట్టిన బిఆర్ఎస్ నేతలకు స్వపక్షంలోనే విపక్షం తయారు కావడం అవినీతి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు క్రైమ్ నెం 480/2024 25, 420, 406 r/w 34 IPC సెలెక్షన్ క్రింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు తో అటు బల్దియా అధికారులను ఇటు పాలకవర్గాన్ని ఇరకాటంలో పడేస్తుంది. ప్రభుత్వం మారడంతో పలచబడుతున్న బీఆర్ఎస్ పార్టీకి బల్దియాలో అవినీతిపై మాజీ మేయర్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అవినీతి అక్రమాలు ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుని… బల్దియాలో ఏం జరుగుతుందనేది సర్వత్రా చర్చసాగుతుంది.
స్వపక్షంలో విపక్షంలా విమర్శలు….!
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న తంతుపై పాలకవర్గం నేతలే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు నోరు మెదపని పాలకవర్గం కార్పొరేటర్లు ఇప్పుడు నిధుల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ ప్రశ్నిస్తున్నారు.
అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ అధికారులపై మండిపడడమే కాకుండా కేసుల వరకు వెల్లడం కలకలం సృష్టిస్తుంది. ఇటీవల పాలకవర్గం కార్పొరేటర్లతో పాటు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సైతం బల్దియాలో జరిగిన అవినీతిపై బహిరంగంగా విమర్శలు చేయడమే కాదు ఏకంగా మాజీ మేయర్ పోలీస్ లకు పిర్యాదు చేశారు.
స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. ఆధారాలతో కూడిన ఫిర్యాదును అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను కేటాయించి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేసిన ఈ పథకం అమలులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయిస్తుందని... ఈ నిధులను కేవలం నగర పరిధిలో మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు. నగరంలో నిధులను వేరే పనులకు మళ్లించి పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసిందని ... నిధుల దుర్వినియోగం చట్టంలో శిక్షార్హమైనదని రవీందర్ సింగ్ వివరించారు.
అసలు ఏం జరిగింది..?
నగరాన్ని ఆనుకుని ఉన్న బొమ్మకల్ జంక్షన్ అభివృద్ధి కోసం 2022 ఆగస్టు8న టెండర్లు పిలిచారు. బొమ్మకల్ గ్రామం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేదు. స్మార్ట్ సిటీ పనుల పరిధిలోకి రాదని రవీందర్ సింగ్ స్పష్టం చేశారు. ఇదంతా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ (పిఎంసీ), మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మేయర్ కలిసి కరీంనగర్ స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఉద్దేశించిన నిధులను పక్కదారి పట్టించేందుకు పథకం పన్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు.
నగరానికి సంబంధించిన నిధులతో గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం నిబంధనలకు విరుద్దమన్నారు. సదరు టెండర్ల ద్వారా పనులు పొందిన కాంట్రాక్టర్ ఇప్పటికే 25 శాతం పనులు పూర్తి చేసి నిధులు పక్కదారి పట్టించారన్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్నారు. ఇందుకు కారణమైన మున్సిపల్ కమిషనర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీతో పాటు ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న ఇతరులపై చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని రవీందర్ సింగ్ వన్ టౌన్ పోలీసులకు గత జులై 3న ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకుండా మీన మేషాలు లెక్కించడంతో హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయసూత్రాలు, రాజ్యంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించారని వివరించారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐని ఆధేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రైవేటు వ్యక్తుల ఫిర్యాదుతో…
సాధారణంగా అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాయి. లేదా సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదు చేసిన సందర్భంలో మాత్రమే ఎఫ్ఐఆర్ జారీ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ సాధారణ వ్యక్తులు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరిన సందర్భాలు కానీ, ప్రైవేటు వ్యక్తులు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సందర్భాలు కానీ ఇంతవరకు జరగలేదు. ప్రభుత్వంతో సంబంధం లేని వారు ఇచ్చిన ఫిర్యాదును అనుసరించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ జారీ అయింది.
వెనుక ఉన్న నేత ఎవరు?*
కరీంనగర్ నగర పాలక సంస్థ స్మార్ట్ సిటీ హోదా లభించిన తర్వాత నగర అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. అయితే ఈ నిధులతో అధికారులు నగరంలోని డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
కానీ నామమాత్రంగా నగరాన్ని అభివృద్ధి చేసిన అధికారులు స్మార్ట్ సిటీ నిధులను గ్రామపంచాయతీలకు తరలించడం వెనుక బడా నేతల ప్రమేయం ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులను పక్కదారి పట్టించడం పై పాలకవర్గం కార్పొరేటర్లే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వంలో ఓ ప్రధాన నాయకుడి కనుసన్నల్లో నిధులను నగరంలో కాకుండా గ్రామ పంచాయితీలో పనులు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ కింద విడుదలైన నిధులను, నగరపాలక సంస్థ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పక్కదారి పట్టించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఏ ఉద్దేశంతో నిధులను పక్కదారి పట్టించారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
అధికారులే ఈ తతంగానికి పాల్పడ్డారా లేదా ఎవరైనా బడా నేతలు అధికారులతో ఈ పని చేయించారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవినీతికి పాల్పడిన అధికారులపై ఉన్నతాధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.