Hyderabad To Singapore Colombo Flight : ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి నేరుగా కొలంబో, సింగపూర్ కు విమానాలు
Hyderabad To Singapore Colombo Flight : శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మరో రెండు అంతర్జాతీయ ప్రదేశాలకు విమానాలు నడుపుతున్నారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ సింగపూర్, కొలంబోలకు విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది.
Hyderabad To Singapore Colombo Flight : హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రయాణికులకు శుభవార్త అందించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మరో రెండు అంతర్జాతీయ మార్గాల్లో విమాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు ఇండిగోతో కలిసి శుక్రవారం వెల్లడించింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, కొలంబోలను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇండిగో పేర్కొంది. కాగా హైదరాబాద్ - సింగపూర్ మధ్య విమాన సర్వీసులు అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ సమయాల్లో విమానాల రాకపోకలు
అయితే శంషాబాద్ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి 2:50 గంటలకు 6E-1027 విమానం బయల్దేరి సింగపూర్ టైం ప్రకారం సింగపూర్ విమానాశ్రయంలో ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సింగపూర్ టైం ప్రకారం సింగపూర్ విమానాశ్రయంలో రాత్రి 23.25 గంటలకు బయలదేరి తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి అర్ధరాత్రి 1:30 గంటలకు చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్ - కొలంబో మధ్య నడిచే 6E- 1181 విమాన సర్వీసులు వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే 6E - 1181 విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం 11:50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్ కు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. కాగా ఈ నాన్ స్టాప్ ఫ్లైట్ వారానికి నాలుగు రోజులు సోమ,మంగళ,శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
10 అంతర్జాతీయ ప్రాంతాలతో అనుసంధానం
ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా మాట్లాడుతూ ...హైదరబాద్ నుంచి సింగపూర్, కొలంబోలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఈ సేవలను ప్రారంభించడంతో శ్రీలంక, సింగపూర్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, వాణిజ్యం, పర్యాటకాన్ని మరింత పెంచేందుకు ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. ఈ విమానాలతో హైదరాబాద్ నగరాన్ని పది అంతర్జాతీయ గమ్య స్థానాలతో అనుసంధానం చేయనున్నట్లు వినయ్ మల్హోత్రా వెల్లడించారు. విమాన సర్వీసులను పెంచడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన వసతులు కల్పిస్తామని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా హామీనిచ్చారు.