TSRTC : టీఎస్ఆర్టీసీ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్, అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారం-hyderabad tsrtc 100 days grand festival challenge to employees in festival season ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc : టీఎస్ఆర్టీసీ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్, అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారం

TSRTC : టీఎస్ఆర్టీసీ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్, అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారం

HT Telugu Desk HT Telugu
Oct 07, 2023 10:30 PM IST

TSRTC : దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండగలకు ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TSRTC : హైదరాబాద్ లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్ లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఎండీ వీసీ సజ్జనార్ హాజరయ్యారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేశారు. మొత్తం 286 మందికి అవార్డులు వరించగా వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్ కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్ కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్ లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ ల‌తో పాటు సూప‌ర్‌వైజ‌ర్స్‌, డిపో మేనేజ‌ర్స్‌, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు సహా అన్ని విభాగాల వారు పుర‌స్కారాల‌ను అందుకున్నారు.

yearly horoscope entry point

దేశానికే టీఎస్ఆర్టీసీ రోల్ మోడల్

ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ గత రెండేళ్లలో టీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను త‌ట్టుకుని తన కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌గ‌లిగే స్థాయికి సంస్థ ఎద‌గ‌డం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని వివరించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇంతమొత్తంలో ఆదాయం రాలేదన్నారు. శ్రావణ మాసంలో ఛాలెంజ్ లోనూ గత ఏడాదితో పోల్చితే అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ రికార్డుల్లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువై దేశానికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మోడల్ గా నిలిచిందని సంస్థ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్

రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకమన్నారు సజ్జనార్. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వంటి పండగలకు ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుందని సజ్జనార్ తెలిపారు. గత ఛాలెంజ్ మాదిరిగానే పనిచేసి ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలని సజ్జనార్ కోరారు. పండుగలకు సిబ్బంది చేస్తోన్న త్యాగం గొప్పదని, ఇంట్లో కుటుంబసభ్యులను, బంధుమిత్రులను విడిచి విధులు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పండగ సమయాల్లో పోలీస్, రవాణా శాఖలు సంస్థకు ఎంతగానో సహకరిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

ఈ డిసెంబర్ నుంచి 1000 డీజిల్ బస్సులు

టీఎస్ఆర్టీసీ కష్టకాలంలో ఉన్నప్పటికీ 2017 నుంచి విడతల వారీగా పెండింగ్ లో ఉన్న 9 డీఏలను ఉద్యోగులకు సంస్థ మంజూరు చేసిందన్నారు. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇవ్వాల్సి ఉన్న అరియర్స్, సీసీఎస్ నిధులు, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిను కూడా చెల్లిస్తామన్నారు. బకాయిలు చెల్లింపు విషయంలో ఒక ప్రణాళికను సంస్థ రూపొందించిందని సజ్జనార్ తెలిపారు. ఒకవైపు ప్రయాణికుల‌కు మెరుగైన స‌దుపాయాలు కల్పిస్తూనే సిబ్బంది సంక్షేమానికి కూడా సంస్థ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఈ నవంబర్, డిసెంబర్ నుంచి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో హైదరాబాద్ లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్లాన్ చేసినట్లు ఆయన వివరించారు.

ఛాలెంజ్ ల్లో అత్యుత్తమ ప్రదర్శనకు నగదు పురస్కారాలు

రాఖీ పౌర్ణమి ఛాలెంజ్: ఫస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ(రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్(రూ.50 వేలు).

శ్రావణ మాసం ఛాలెంజ్: ఫస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్(రూ.లక్ష), సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ (రూ.75 వేలు), థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్(రూ.50 వేలు).

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner