TS Police Jobs: ఆ ‘ఆప్షన్’ ఇవ్వండి.. డీజీపీ ఆఫీస్ ముందు ట్రాన్స్ జెండర్ల ఆందోళన
తెలంగాణ డీజీపీ ఆఫీస్ మందు ట్రాన్స్ జెండర్లు ధర్నాకు దిగారు. టీఎస్ఎల్పీఆర్ బీ( Telangana State Level Police Recruitment Board ) వెబ్ సైట్ లో ‘ట్రాన్స్ జెండర్ ఆప్షన్’ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.
హైదరాబాద్ లోని తెలంగాణ డీజీపీ ఆఫీస్ ముందు ట్రాన్స్ జెండర్లు ఆందోళనకు దిగారు. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లో ట్రాన్స్ జెండర్ ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి…
"పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు టీఎస్ఎల్పీఆర్ బీ( Telangana State Level Police Recruitment Board ) వెబ్ సైట్ లో ట్రాన్స్ జెండర్ ఆప్షన్ లేదు. కేవలం మహిళా, పురుషల ఆప్షన్ లు మాత్రమే అందుబాటులో ఉంచారు. ట్రాన్స్ జెండర్ల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది.కానీ తెలంగాణ ప్రభుత్వం ఆయా తీర్పులను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతోంది. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని.. రిక్రూట్ మెంట్ వెబ్ సైట్ లో ట్రాన్స్ జెండర్ ఆప్షన్ కూడా ఇవ్వాలి" - వైజయంతి మోగ్లీ, ట్రాన్స్ జెండర్ హక్కుల కార్యకర్త
ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పించేలా ఆదేశాలు ఇచ్చాయని వైజయంతి మోగ్లీ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా...తెలంగాణ పోలీసు శాఖ భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలని కోరారు.
వినతిపత్రం ఇచ్చారు - డీజీపీ కార్యాలయం
ఈ అంశంపై డీజీపీ పీఆర్వీ వెంకటరమణ స్పందించారు. వెబ్ సైట్ లో ఆప్షన్ కోసం లక్డీకాపూల్ లోని డీజీపీ ఆఫీసు ముందు ట్రాన్స్ జెండర్లు ధర్నా చేపట్టారని.. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారని వెల్లడించారు.