TSRTC Special Buses : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జానికి టీఎస్ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులు
TSRTC Special Buses : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, శోభాయాత్రకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 535 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు సజ్జనార్ తెలిపారు.
TSRTC Special Buses : హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తుల కోసం 535 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించగలరన్నారు.
ప్రత్యేక బస్సులు
ఎంఎంటీఎస్ సర్వీసులు పొడిగింపు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నగరంలో అతిపెద్ద గణపయ్య ఖైరతాబాద్ గణేష్ ను సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. సెప్టెంబర్ 28 రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు భక్తులకు ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 28న బడా గణేష్ నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల అనంతరం గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీంతో 28 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ మూడు కమీషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు. రాచకొండ పరిధిలో ఏర్పాట్లపై సీపీ డీఎస్ చౌహాన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. నగర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. గణేష్ నిమజ్జనానికి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాల కోసం నెలరోజుల ముందు నుంచే ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని రోడ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని పూర్తి చేశామన్నారు. వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి ముందు నిర్వహకులతో ఇంటిమేషన్ ఫామ్ తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఎన్ని విగ్రహాలు ప్రతిష్టించారన్న విషయంలో క్లారిటీ వచ్చిందన్నారు. తద్వారా నిమజ్జనానికి ఏర్పాట్లు, రూట్ మ్యాప్ సిద్ధం చేశామని సీపీ వెల్లడించారు.