TSRJC CET 2024 : టీఎస్ఆర్జేసీ సెట్-2024 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే అప్లికేషన్లు షురూ
TSRJC CET 2024 :తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ అయ్యాయి. నేటి నుంచి మార్చి 16 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
TSRJC CET 2024 : తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో (TSRJC CET 2024) ప్రవేశాలకు అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు. జనవరి 31 నుంచి మార్చి 16 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్ ఎగ్జామ్ లో విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీట్ల కేటాయింపు తొలి కౌన్సెలింగ్ మే నెలలో నిర్వహించే అవకాశం ఉంది. టీఎస్ఆర్జేసీ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సులు ఉంటాయి.
మొత్తం సీట్లు
టీఎస్ఆర్జేసీ సెట్ ద్వారా మొత్తం 2,996 ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లు భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఎంపీసీ 1496, బైపీసీ 1440, ఎంఈసీ 60 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ సెట్ కు అప్లై చేసుకోవడానికి అర్హులు అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్ లైన్ లో రుసుము రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
పరీక్ష విధానం
టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా సబ్జెక్ట్ ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్‌లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ , సిద్ధిపేట, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.
టెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు
తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇప్పటికే విడుదల అయ్యింది. ఎగ్జామ్ ఫీజు గడువు కూడా ముగిసింది. అయితే పరీక్షల ఫీజు తత్కాల్ కింద ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. గడువు పొడిగించే ప్రసక్తి లేదని వెల్లడించారు. సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు చెల్లించిన ఫీజు మొత్తాన్ని ఫిబ్రవరి 6వ తేదీలోపు ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని ఆదేశించారు. అదేరోజు నామినల్ రోల్స్‌ను కూడా డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
- మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
- మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- మార్చి 23- మ్యాథమెటిక్స్
- మార్చి 26- సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
- మార్చి 28- సైన్స్ పేపర్ -2(బయాలజీ)
- మార్చి 30- సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 1- ఒకేషనల్ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్),
- ఏప్రిల్ 2- ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్).
సంబంధిత కథనం