Bigg Boss Notices : బిగ్ బాస్ ఫైనల్ రోజు అల్లర్ల ఘటన, షో నిర్వాహకులకు పోలీసుల నోటీసులు
Bigg Boss Notices : ఈ నెల 17న బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని షో నిర్వాహకులకు పోలీసులు ఇచ్చారు. భారీగా అభిమానులు వచ్చినా పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని కోరారు.
Bigg Boss Notices : ప్రముఖ టెలివిజన్ షో బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 17వ తేదీన ఫిల్మ్ నగర్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన అల్లర్లపై వివరణ ఇవ్వాలని కోరుతూ పోలీసులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పై చర్యలు తీసుకున్న పోలీసులు....అతడిని చంచల్ గుడ్ జైల్ కు తరలించారు. అనంతరం పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు
అయితే డిసెంబర్ 17వ తేదీన రాత్రి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ జరిగింది. ఆ రోజు రాత్రి విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియోస్ కు చేరుకుని హంగామా చేశారు. ప్రశాంత్, అమర్ దీప్ బయటకు వచ్చిన తరువాత ఇరువురు అభిమానుల మధ్య వివాదం తలెత్తింది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ప్రశాంత్ అభిమానులు రన్నరప్ అమర్ దీప్ కారుపై దాడి చేశారు. ఆ సమయంలో అమర్ దీప్ కుటుంబం కారులోనే ఉన్నారు. అయన కారుతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్లు గీతు రాయల్, అక్షిత, అశ్విని కార్లపై కూడా కొందరు అభిమానాలు రాళ్లతో దాడి చేశారు.
రద్దీ విపరీతంగా ఉన్న సమాచారం ఎందుకు ఇవ్వలేదు
మరోపక్క అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులపై కూడా ఆకతాయిలు రాళ్ళు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరడంతో.....ప్రశాంత్ తో సహా మరో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. స్టూడియో వద్ద భారీ ఎత్తున అభమానులు గుమ్మికూడినా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నోటీసులో జూబ్లీహిల్స్ పోలీసులు షో నిర్వాహకులనుప్రశ్నించారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో హోస్ట్ గా చేసిన అక్కినేని నాగార్జునపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారా? అన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా