Gitam Student : గీతం వర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య, నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎన్.హెచ్ఆర్సీ నోటీసులు
Gitam Student : సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
Gitam Student : ఈనెల 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రేణుశ్రీ (18) యూనివర్సిటీ బిల్డింగ్ పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను.....జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్వీకరించింది. రేణు శ్రీకి ఆ వర్సిటీలో చదువుకోవడం ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రులు బలవంతం మీద గీతం యూనివర్సిటీలో బీటెక్ చదువుతుంది. రేణు శ్రీ క్లాసులకు వెళ్లకుండా బయట క్యాంపస్ లో తిరుగుతూ ఎంజాయ్ చేసేది.
ఆమె కదలికలను తన తల్లిదండ్రులు స్నేహితుల ద్వారా తెలుసుకునేవారు. అనంతరం కూతురుకు ఫోన్ చేసి మందలించేవారు. ఒకవైపు చదువు ఇష్టం లేకపోవడం మరో పక్క నిత్యం తన స్నేహితులకు ఫోన్ చేసి తన గురించి ఆరా తీయడంతో రేణు శ్రీ ఈనెల 5వ సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోబోయే ముందు కూడా రేణు శ్రీ స్నేహితురాలితో మాట్లాడింది. మీ కుటుంబ సభ్యులు నీ గురించి అడుగుతున్నారని స్నేహితురాలు రేణు శ్రీతో చెప్పింది. స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండగానే ఆమె కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.
నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వండి
ఇక ఇదే వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ స్టేట్ చీఫ్ సెక్రటరీ, పోలీసులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. కళాశాల అడ్మినిస్ట్రేషన్ లో నిర్వహించిన పోలీసు విచారణ, విచారణ ఫలితాలు, సంఘటనకు బాధ్యులను గుర్తించి వ్యక్తులపై తీసుకున్న చర్యలు, అటువంటి బాధాకరమైన సంఘటన పునరావృతం కాకుండా చూసేందుకు తీసుకున్న చర్యలు కూడా నివేదికలో చేర్చాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కాగా ప్రస్తుతం కూకట్ పల్లి లో నివాసం ఉంటున్నట్లు తోటి విద్యార్థులు తెలిపారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా