Hyderabad News : దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో ప్రమాదం, అగ్నికి ఆహుతైన రెండు బస్సులు
Hyderabad News : దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఎక్స్ ప్రెస్ బస్సులు దగ్ధమయ్యాయి.
Hyderabad News : హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ ప్రెస్ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆ బస్సు పక్కనే ఉన్న మరో బస్సుకు మంటలు వ్యాపించాయి. మంటలు దాటికి రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. ఆర్టీసీ డిపో సిబ్బంది, స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా బస్సులో మంటలు ఎందుకు చెలరేగాయి అనేది మాత్రం తెలియలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా బస్సులు డిపోలోనే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం, మంటలు మరిన్ని బస్సులుకు వ్యాపించకుండా అదుపు చెయ్యడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. మొదట మంటలు చెలరేగిన బస్సులో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు డిపో అధికారులు భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రీమియం చెల్లించకుండానే ఆర్టీసీ ఉద్యోగులకు రూ.కోటి బీమా
ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం... రూ.40 లక్షల నుంచి రూ. ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ..... ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారని చెప్పారు.యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి రూ.ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా