Hyd Metro: క్రికెట్ ఫ్యాన్స్‌కు ‘మెట్రో’ గుడ్ న్యూస్.. 25న ప్రత్యేక రైళ్లు
hyderabad metro trains: క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ వేదికగా భారత్ - ఆసీస్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రత్యేక రైళ్లను నడపనుంది.
hyderabad metro special trains for cricket match: హైదరాబాద్ మెట్రో రైలు సెప్టెంబర్ 25న ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం పలు చర్యలు చేపట్టింది.
స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి సెప్టెంబర్ 25న రాత్రి 11 గంటల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చివరి రైలు అర్ధరాత్రి 1 గంటలకు అమీర్ పేట్, జేబీఎస్, పరేడ్ గ్రౌండ్ నుంచి కనెక్టింగ్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక రైళ్ల సేవల సమయంలో... ఉప్పల్ స్టేడియం, NGRI మెట్రో స్టేషన్లలో మాత్రమే ప్రవేశాలు అనుమతించబడతాయని అధికారులు పేర్కొన్నారు. అన్ని ఇతర స్టేషన్లు నిష్క్రమణల కోసం మాత్రమే తెరవబడతాయని స్పష్టం చేశారు.
మ్యాచ్ కు వెళ్లే ముందే రిట్నర్ టికెట్ తీసుకుంటే మంచిందని మెట్రో అధికారులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే తిరిగి వెళ్లే సమయంలో క్యూలో నిలబడకుండా ఉంటుందని చెబుతున్నారు. స్మార్ట్ కార్డ్‌లను ఉపయోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు. తమ ప్రయాణాన్ని సురక్షితంగా సాగేలా హైదరాబాద్ మెట్రో రైలు భద్రతా సిబ్బంది మరియు సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని ఓ ప్రకటనలో కోరారు.
మరోవైపు మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. శుక్రవారం నాగపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ విక్టరీ కొట్టింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. దీంతో చివరి టీ20 మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఆదివారం జరగనుంది. సిరీస్ నిర్ణయించే మ్యాచ్ కావటంతో... అందరి చూపు హైదరాబాద్ వైపు మళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.
మెట్రో వార్నింగ్....
Hyd Metro On Posters Ban: మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికించటాన్ని సీరియస్ గా తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రకటనకర్తలు మెట్రో పిల్లర్లు, రైల్వే స్టేషన్లను ప్రకటనల కేంద్రంగా మార్చుకోవటం సరికాదని... ఇలా అనుమతుల్లేకుండా పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
మెట్రో పిల్లర్స్‌పై ఇష్టానుసారంగా పోస్టర్లు అంటించిన వారిపై సెంట్రల్ మెట్రో యాక్ట్ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష విధించే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇక మీదట ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. మెట్రో పిల్లర్స్‌కు ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డుల ద్వారా తమ ప్రచార కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని, అందుకోసం ప్రకటన ఏజెన్సీలను ఆశ్రయించాలని సూచించింది. ఎవరికి వారు పోస్టర్లు అంటిస్తే చర్యలు తప్పవని.. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరింది.