Hyderabad Restaurants : హైదరాబాద్ వాసులారా అలర్ట్, రాత్రి చేసిన ఆహారం వేడి చేసి సర్వ్ చేస్తున్న రెస్టారెంట్లు!
Hyderabad Restaurants : హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాత్రుళ్లు చేసిన ఆహారాన్ని వేడి చేసి ఉదయం కస్టమర్లకు పెడుతున్న ఫిర్యాదులతో మాదాపూర్ లోని లక్కీ హోటల్ తనిఖీలు చేశారు.
Hyderabad Restaurants : బయట ఫుడ్ కు అలవాటు పడిన భాగ్యనగరం వాసులకు ఇటీవల ఘటనలు కలవరపెడుతున్నాయి. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు వరుసగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో నాణ్యతలేని ఆహార పదార్థాలు, అపరిశుభ్ర వంటగదులను చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తున్నాయి కొన్ని రెస్టారెంట్లు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ ఆహారం తిన్న యువకులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో జీహెచ్ఎండీ అధికారులు ఆ హోటల్ ను సీజ్ చేశారు. తాజాగా మాదాపూర్ లోని లక్కీ రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు.
రాత్రి చేసిన ఆహారం వేడి చేసి కస్టమర్లకు
హైదరాబాద్ మాదాపూర్ లోని లక్కీ రెస్టారెంట్లో రాత్రుళ్లు చేసిన ఆహారాన్ని తిరిగి తెల్లవారుజామున వేడి చేసి కస్టమర్లకు పెడుతున్నారని ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు మదాపూర్ లక్కీ రెస్టారెంట్ కు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఇటీవలే కాలంలో సంక్టియా ఇంటర్నేషనల్ స్కూల్ కిచెన్, ఆల్ఫా హోటల్ లో తనిఖీలు నిర్వహించి ఆహారం తయారీకి నాణ్యమైన పదార్థాలను వాడనందున, ఆహారం తయారు చేసే ప్రాంగణంలో శుభ్రత లేకపోవడం వంటివి గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేసి వాటిని సీజ్ చేశారు. అప్పటి నుంచి అధికారులు నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్కూల్ కిచెన్స్ పై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
ఆల్ఫా హోటల్ సీజ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అతి సమీపంలోని ఆల్ఫా హోటల్ ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతుంటుంది. రద్దీ ఎక్కువగా ఉంటే ఈ హోటల్ లో పరిశుభ్రత కొరవడింది. కస్టమర్లకు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు అందిస్తున్నారని గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఇటీవల ఈ హోటల్లో మటన్ కీమా, రోటీ తిన్న యువకులు అస్వస్థత గురయ్యారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ లో తనిఖీలు చేశారు. అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని, అక్కడే ఆహార పదార్థాల తయారీ చూసి షాక్ తిన్నారు. చివరకు హోటల్ ను సీజ్ చేశారు అధికారులు. ఈ హోటల్ ఆహారం తిన్న కొందరు అస్వస్థతకు గురికావడం, ఈ నెల 15న కొంత మంది ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు స్పందించారు. అల్ఫా హోటల్‌ను పరిశీలించిన అధికారుల ఆహార నాణ్యతపై కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ను నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీకి పంపి పరీక్షిస్తున్నారు. వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతలేని ఆహారం తయారీని గుర్తించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్