Navdeep Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ కేసు, ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్!
Navdeep Drugs Case : టాలీవుడ్ హీరో నవదీప్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో నవదీప్ ను అధికారులు విచారిస్తున్నారు.
Navdeep Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మంగళవారంహైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు నవదీప్ హాజరయ్యారు. ఇటీవలే తెలంగాణ నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను విచారించగా.. ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందా? అనే కోణంలో నవదీప్ ను విచారించారు. ఈ విచారణలో మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లతో నవదీప్ కి ఉన్న సంబంధాలు, వారి మధ్య జరిగిన లావాదేవీలను, నవదీప్ ఫోన్ కాల్ డాటా, మేసేజ్ లను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు.
తెలంగాణ నార్కోటిక్ అధికారుల విచారణ
తెలంగాణ నార్కోటిక్ అధికారులు సేకరించిన ఆధారాలను, సమాచారాన్ని కూడా ఈడీకి సమర్పించాల్సిందిగా అధికారులు కోరినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే హైదరాబద్ జిల్లా గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో నమోదైన మాదక ద్రవ్యాల కేసులో బహిర్గతమైన అంశాలు ఆదారంగా ఈడీ ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని హీరో నవదీప్ ను కోరిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులకు చిక్కిన సినీ నిర్మాత వెంకటరత్నం రెడ్డి, రాంచంద్ నార్కోటిక్ పోలీసులు విచారించడంతో హీరో నవదీప్ పేరు బయటికి వచ్చింది. ఈ క్రమంలోనే నార్కోటిక్ పోలీసులు కొన్ని రోజులు క్రితం నవదీప్ ను ఆరు గంటల పాటు విచారించగా ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు
2017లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలువురు సినీ హీరోలతో పాటు హీరోయిన్లను విచారించింది ఈడీ. ఈ కేసులో నవదీప్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు నవదీప్ హాజరుకాలేదు. అయితే తాజాగా మాదాపూర్ డ్రగ్స్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవల హీరో నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నవదీప్‌ను 37వ నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితుడు రాంచంద్ నుంచి హీరో నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నార్కోటిక్స్ బ్యూరో చెప్పింది. మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించారు. దీంతో సెప్టెంబర్ 23వ తేదీన సైఫాబాద్ లోని నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ కార్యాలయంలో 6 గంటలకు పైగా పోలీసులు నవదీప్ ను విచారించారు.