Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం- పిస్టల్ తో హోంగార్డు బెదిరింపు, వ్యక్తి ఆత్మహత్య-hyderabad crime news in telugu man commits suicide home guard threaten with pistol ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం- పిస్టల్ తో హోంగార్డు బెదిరింపు, వ్యక్తి ఆత్మహత్య

Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం- పిస్టల్ తో హోంగార్డు బెదిరింపు, వ్యక్తి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Jan 28, 2024 05:37 PM IST

Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పక్కనున్న హోమ్ గార్డు వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హోంగార్డు బెదిరింపులతో వ్యక్తి ఆత్మహత్య
హోంగార్డు బెదిరింపులతో వ్యక్తి ఆత్మహత్య

Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పక్కనే నివసించే హోమ్ గార్డ్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామంతపూర్ లోని సత్య నగర్ లో నాగరాజు, శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాగరాజు హోం గార్డ్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్, నాగరాజుల ఇండ్లు పక్కపక్కనే ఉంటాయి. వీరి ఇద్దరి మధ్య గత కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీనివాస్ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా శ్రీనివాస్ మృతికి హోం గార్డు నాగరాజే కారణమంటూ శ్రీనివాస్ బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగరాజు తన పిస్టల్ తో శ్రీనివాస్ ను పలుమార్లు బెదిరించాడని మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హోం గార్డు నాగరాజు వేధింపులు తాళలేకే శ్రీనివాస్ మరణించాడని ఆరోపిస్తూ....శ్రీనివాస్ మృతదేహంతో నాగరాజు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో వారు ఆందోళనను విరమించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోం గార్డు నాగరాజును అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మానసిక సమస్యతో బాధ పడుతున్న మహిళా ఆత్మహత్య...

మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కెపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం..... తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పల్లవి వీధికి చెందిన శ్రీనివాసరాజు, అనంతలక్ష్మి నాగదేవి ( 29) దంపతులు నగరానికి వచ్చి భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత పదేళ్లుగా లక్ష్మీ నాగదేవి మానసిక సమస్యలతో బాధ పడుతుంది. అందుకోసం నాగదేవి చికిత్స పొందుతుంది. అయినా సరే వ్యాధి నయం కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనైన లక్ష్మీ నాగదేవి..... శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని మొదట గుర్తించిన ఆమె కుమారుడు చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు భర్తకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అత్తాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని సైనిక్ పురి ప్రాంతానికి చెందిన అతిథి భరద్వాజ్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంది. ఆమె అత్తాపూర్ లోని హ్యాపీ ఫార్చున్ అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్ లో అద్దెకు ఉంటుంది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున తన ప్లాట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా అతిథి భరద్వాజ్ ఓ అబ్బాయితో ప్రేమలో పడిందని..... అతడు ఆమెను తన అవసరాలకు వినియోగించుకుని వదిలేయడంతో తీవ్ర మనోవేదన గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సోదరి మృతిపై ఆమె సోదరుడు మాత్రం ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner