Hyderabad Crime : డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ యూనివర్సిటీ విద్యార్థులు, లోన్ యాప్స్ అప్పు తీర్చేందుకు పక్కదారి!
Hyderabad Crime : హైదరాబాద్ లో బ్రౌన్ షుగర్ అమ్ముకున్న ఇద్దరు విద్యార్థులను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. లోన్ యాప్స్ లో తీసుకున్న అప్పులు కట్టేందుకు ఈ ఇద్దరూ డ్రగ్స్ అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు తెలుస్తోంది.
Hyderabad Crime : హైదరాబాద్‌లో టాస్క్ ఫోర్స్ పోలీసులు బ్రౌన్ షుగర్ ను పట్టుకున్నారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 26 గ్రాముల కొకైన్, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్న విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ అనే స్టూడెంట్ తో పాటు వీర సాయి తేజ అనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో సప్లై చేసేందుకు నవీన్, సాయి పెద్ద మొత్తంలో హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చారు. వివిధ లోన్ యాప్స్ లో తీసుకున్న లోన్ లను కట్టేందుకే నవీన్ డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్
హైదరాబాద్ లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులతో కలిసి ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ బాల శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం....సూర్యాపేట జిల్లా బొడ్రాయి బజార్ కు చెందిన సాయి నవీన్, వంశీ స్నేహితులు.తేలికగా డబ్బు సంపాదించాలని ఇద్దరూ కలిసి గత కొంత కాలంగా గంజాయిని విక్రయించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి రూ.3 వేలకు కిలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా వెయ్యి రూపాయలకు 10 గ్రాములు చొప్పున విక్రయిస్తున్నారు.
గతంలో కూడా
మొత్తం 2.6 కిలోల గంజాయిని హైదరాబాద్ లో అమ్మడానికి వీరిద్దరూ నగరానికి వచ్చారు. హబ్సీగూడ ప్రాంతంలో ఈ గంజాయిని కస్టమర్లకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధర్ బాబు, ఎస్సై అనంత చారి, కానిస్టేబుల్ రాకేష్ తో కలిసి అదనపు డీసీపీ నర్సింహ రావు పర్యవేక్షణలో ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు సాయి నవీన్ గంజాయి అమ్ముతూ సూర్యాపేట టౌన్, మోతె పోలీసులతో పాటు ఖమ్మం ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడినట్టు డీసీపీ శ్రీధర్ బాబు తెలిపారు. ఇక వంశీ గతంలో ఒకసారి గంజాయి అమ్ముతూ మోతె పోలీసులకు దొరికాడని ఆయన వివరించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా