Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరిట ఘరానా మోసం, రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్-hyderabad crime news in telugu gold rose beauty parlors cheating customers 3 crore ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరిట ఘరానా మోసం, రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్

Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరిట ఘరానా మోసం, రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్

HT Telugu Desk HT Telugu
Jan 29, 2024 10:44 PM IST

Hyderabad Crime : రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్స్ పేరుతో కస్టమర్లకు టోకరా వేసి రూ.3 కోట్లలో కిలాడి దంపతులు జంప్ అయ్యారు. సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేయించి బ్రాంచ్ లు పెట్టించి కస్టమర్లను నిండాముంచారు.

బ్యూటీ పార్లర్ పేరిట మోసాలు
బ్యూటీ పార్లర్ పేరిట మోసాలు

Hyderabad Crime : హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రోజ్ గోల్డ్ నకిలీ బ్యూటీ పార్లర్ పేరుతో కస్టమర్లను మోసం చేసి రూ.3 కోట్ల వరకు కాజేశారు ఓ కిలాడి జంట. హైదరాబాద్ లోని ప్రగతినగర్ హెడ్ ఆఫీస్ అడ్డాగా అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జన్సిక కలిసి నకిలీ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. రాజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో యాడ్స్ ఇస్తూ...సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేయించి కస్టమర్లను ఆకట్టుకునే విధంగా నమ్మించారు. ఫ్రాంచైజ్ పెట్టుకుంటే డబ్బులే డబ్బులు అంటూ వారిని నమ్మించారు. ఈ యాడ్స్ చూసిన వారు డబ్బు ఆశతో నకిలీ బ్యూటీ పార్లర్ వాళ్లను కాంటాక్ట్ అయ్యారు.

yearly horoscope entry point

ఫ్రాంచైజ్ తీసుకుంటే డబ్బులే డబ్బులంటూ నమ్మించి

బాధితుల నుంచి లక్షల్లో పెట్టుబడి పెట్టించి 100కు పైగా బ్రాంచ్ లు ఓపెన్ చేయించారు. హైదరాబాద్ లోనే కాదు జిల్లాల వారీగా కూడా బాధితులు ఉన్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో బ్రాంచ్ లు ఓపెన్ చేశారు. ఒక్క బ్యూటీ పార్లర్ కోసం మూడు లక్షలు... బాధితుల నుంచి వసూలు చేశారు. కాగా ఫ్రాంచైజ్ తీసుకుంటే నెలకు 35,000 జీతం ఇస్తామని ఆ కిలాడి దంపతులు నమ్మించారు. దంపతుల మాయమాటలు నమ్మిన కొందరైతే మంగళసూత్రాలు, అప్పులు చేసి ఫ్రాంచైజ్ తీసుకున్నారు. ముందు చెప్పినట్టుగానే రెండు మూడు నెలల పాటు 35 వేల జీతం బాధితులకు కరెక్ట్ సమయానికి ఇచ్చారు.

గతంలో కూడా ఇలాంటి మోసాలే

ఆ తర్వాత అసలు కథ మొదలైంది. నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు వారికి ఫోన్ లు చెయ్యడం మొదలు పెట్టారు. దీంతో రేపు, మాపు అంటూ కాలం గడుపుతూ వచ్చారు. బాధితులకు అనుమానం వచ్చి హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ కు వచ్చి చూడగా...తాళం వేసి ఉండటంతో బాధితులు షాక్ తిన్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టామని ఆ దంపతులు తమను నిండా ముంచారని వారిని పట్టుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతుల కోసం గాలింపు చేపట్టారు. అయితే ఈ కిలాడి దంపతులు గతంలో కూడా కామారెడ్డి జిల్లాలో చిట్ ఫండ్స్ పేరుతో కోట్ల రూపాయల మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner