Etela Rajender : జనాభా ప్రకారం ముదిరాజ్ లకు 11 ఎమ్మెల్యే సీట్లు ఉండాలి, బీసీ ఏ లోకి మార్చాలి - ఈటల రాజేందర్
Etela Rajender : ముదిరాజ్ లను బీసీ ఏ లోకి మార్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు 11 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలన్నారు.
Etela Rajender : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముదిరాజుల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ముదిరాజ్ వర్గాన్ని ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదన్నారు. ముదిరాజ్ లను బీసీ డి నుంచి ఏ లోకి మార్చాలని నేను ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచి కొట్లాడుతున్నానన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్ లను డి నుంచి ఏ కు మారుస్తానని ప్రకటించారన్నారు. అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారని గుర్తుచేశారు. బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందన్నారు. మైనారిటీ వాళ్లు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో వారు గెలిచారని, మనల్ని ఎవరు లేక పట్టించుకోవడం లేదని తెలిపారు.
మాది మాకు కావాలి
'బీసీ ఏ కోసం డిసెంబర్ 18, 2016న నిజాం కాలేజీలో పెద్ద సభ పెట్టాం. 7 సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. సీఎం కేసీఆర్ మీకు సోయి ఉందా. మందిది మాకు కావాలని అడగలేదు, మాది మాకు కావాలని అడుగుతున్నాం. నీలం మధు, శ్రీనివాస్, పులిమామిడి రాజు లేరా? ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. నాకు అవకాశం ఇస్తే ఈనాటి వరకు ఓడిపోలేదు. నేను పొత్తుల సద్దిలాంటి వాడిని. మాదిగ మీటింగ్ కి పోతే రాజేందర్ మాదిగ అని, లంబాడా వాళ్ల మీటింగ్ పోతే రాజేందర్ నాయక్ అని పిలిచేవారు, అణగారిన వర్గాల వారు ఏదో ఒక రోజు మా జీవితాలు మీ చేతుల్లో పడకపోతాయా బతుకులు మారకపోతాయా అని మాట్లాడిన సందర్భాలు ఎన్నో. 40 రోజులు అసెంబ్లీలో మీటింగ్ పెట్టి అన్ని కులాలు ఎలా బాగుపడాలో ప్రణాళిక తయారుచేసిన వాడిని నేను'- ఈటల రాజేందర్
ముదిరాజ్ లకు 11 సీట్లు
ముదిరాజ్ జనాభా 11 శాతం ఉందని, మాకు 20 వేల కోట్ల బడ్జెట్ ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కానీ చేప పిల్లల పేరుతో మాకు ఇచ్చేది రూ.500 కోట్లే అన్నారు. ఈ వేదిక మీద నుండి డిమాండ్ చేస్తున్న చేపపిల్లలు కాదు డబ్బులు ఇవ్వండి మేమే కొనుక్కుంటామన్నారు. ప్రాజెక్ట్ లలో, చెరువులలో సంపూర్ణ అధికారం మత్స్యకారులకు ఇవ్వాలన్నారు. ప్రతి మత్స్యకారునికి సభ్యత్వం ఇవ్వాలని కోరారు. కేజీకల్చర్ పద్దతిలో చేపలు పెంచేందుకు యువతకు నిధులు ఇవ్వాలన్నారు. ప్రాజెక్ట్ లలో సోలార్ పానెల్స్ పెట్టి మా ఉపాధి పోగొడితే వాటిని పగలగొట్టుడు ఖాయమన్నారు. జనాభా ప్రకారం ముదిరాజ్ లకు 11 ఎమ్మెల్యే సీట్లు ఉండాలని ఈటల అన్నారు. కానీ మనం ఏం చేయగమని బీఆర్ఎస్ ఒక్క సీటు ఇవ్వకుండా, మన ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టారన్నారు. మామీద నమ్మకం లేనప్పుడు మేమెందుకు మీకు ఓట్లు వేయాలని బీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించారన్నారు. 52 శాతం జనాభా ఉండి 9 మంత్రి పదవులు రావాలి కానీ ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఓట్లు మావే సీట్లు మావే
'దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా కేసీఆర్ ద్రోహం చేశారు. గిరిజనులకు అన్యాయం చేశారు. చేపపిల్లలు ఇచ్చారని జేజేలు కొడితే మన బతుకులు మారవు. ముదిరాజ్ జాతిని చూసి మిగిలిన జాతులు అన్నీ కదం తొక్కారు. అన్ని జాతులను ఐక్యం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. రాజ్యాధికారం రావాలంటే ఓపికగా ఉండాలి. ఎన్నాళ్లు ఈ బానిస బతుకులు. పిడికిలి ఎత్తుదాం. ఓట్లు మావే సీట్లు మావే ఇదే మన నినాదం'- ఈటల రాజేందర్.