TSRTC Bus : రన్నింగ్ లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు, ప్రమాదంపై విచారణకు సజ్జనార్ ఆదేశం-huzurabad news in telugu tsrtc bus tire wheels incident sajjanar ordered enquiry ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Bus : రన్నింగ్ లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు, ప్రమాదంపై విచారణకు సజ్జనార్ ఆదేశం

TSRTC Bus : రన్నింగ్ లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు టైర్లు, ప్రమాదంపై విచారణకు సజ్జనార్ ఆదేశం

HT Telugu Desk HT Telugu
Dec 24, 2023 08:42 PM IST

TSRTC Bus : హుజురాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో బస్సు టైర్లు ఊడిపోయాయి. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు.

ప్రమాదానికి గురైన పల్లెవెలుగు బస్సు
ప్రమాదానికి గురైన పల్లెవెలుగు బస్సు

TSRTC Bus : కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజురాబాద్‌-హన్మకొండ రూట్‌ లో వెళ్తున్న TS02UC5936 నంబర్‌ గల ఆర్టీసీ బస్సు......ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్యామేజ్‌ అయింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అద్దె బస్సు డ్రైవర్‌ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాద ఘటనపై వెంటనే టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు.

లోడ్ ఎక్కువై ప్రమాదం జరిగిందన్న వార్తల్లో నిజం లేదు- సజ్జనార్

''హుజురాబాద్‌ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్‌ లోడింగ్‌ వల్లే ప్రమాదానికి గురైనట్లు వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ప్రమాద సమయంలో బస్సు 40 కిలో మీటర్ల వేగంతో వెళ్తోంది. అప్పుడు బస్సుల్లో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరగగానే......బస్సులోని 42 మందిని సురక్షితంగా మరొక బస్సులో టీఎస్‌ఆర్టీసీ అధికారులు పంపించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు జరుగున్న ప్రచారం అవాస్తవం." అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. అద్దె బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు. తరచూ తనిఖీలు చేస్తూ.....తమ బస్సులను ఎప్పుడూ ఫిట్‌ గా ఉంచుకోవాలని సూచించారు. బస్సుల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పూర్థి సామర్థ్యంతో బస్సులను నడపాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్,హైదరాబాద్ జిల్లా

Whats_app_banner