KCR Vs Etela Rajender : గజ్వేల్ లో కేసీఆర్ ను ఢీకొడుతున్న ఈటల- కీలకంగా ముదిరాజ్ ఓటింగ్
KCR Vs Etela Rajender : గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ తొలిజాబితాలో గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పేర్ ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
KCR Vs Etela Rajender : ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గజ్వేల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కనుంది. బీజేపీ నుంచి ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ బరిలోకి దిగటం కాయం కావటంతో, ఇక్కడ హోరాహోరీ తప్పదని తేలిపోయింది. బీజేపీ తన మొదటి జాబితాలో 52 మంది శాసనసభ అభ్యర్థులని ప్రకటిస్తూ, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్ గతంతో ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిసిన హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు, గజ్వేల్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటారని ప్రకటించింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో సఫలీకృతుడైన ఈటల రాజేందర్, ఇక్కడ అదే సామాజిక వర్గానికి సుమారుగా 70,000 ఓట్లు ఉండటంతో వారి ఓట్లతో పాటు, ఇతర బీసీ కులాలు, దళితుల ఓట్ల పైన ఆశలు పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది.
నెలకు ఒక్కరోజు గజ్వేల్ లోనే
ఈ విషయం ముందే తెలుసుకున్న సీఎం కేసీఆర్... రెండు రోజుల క్రితం గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన సుమారు 7,000 మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇక్కడి నుంచి గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో, ఈ ప్రాంతం గొప్ప అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, సీఎం ఎమ్మెల్యేగా సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదనే ప్రచారం ఉంది. అదే విషయాన్ని, కొంతమంది కార్యకర్తలు కేసీఆర్ తో మీటింగ్ లో లేవనెత్తడంతో ఎన్నికల తర్వాత, నెలకు ఒక్కరోజు గజ్వేల్ లోనే ఉంటానని ప్రకటించారు. 1985 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ 2004లో సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కరీంనగర్ లోక్ సభకు పోటీ చేసి గెలిచి పార్లమెంట్ లో తెలంగాణ వాదనను వినిపించారు. ఆ తర్వాత 2009 కూడా లోక్ సభకు పోటీ చేసి, అసెంబ్లీ ఎన్నికలకు దూరం ఉన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడడంతో ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేగా పోటీచేయక తప్పనిసరి అయ్యింది.
పోటీ ఇద్దరి మధ్యే
అప్పటికి సిద్దిపేట నుంచి మంత్రి హరీశ్ రావు పలుసార్లు గెలవడంతో, కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు దశాబ్దాలుగా సీఎం కేసీఆర్ ప్రధాన అనుచరుడిగా ఉన్నఈటల రాజేందర్, తొలిసారి తనపైనే పోటీకి దిగటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తూముకుంట నర్సారెడ్డి బరిలోకి ఉంటారని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో, ఇక్కడ మూడు పార్టీలు కూడా రాబోయే రోజుల్లో పోటా పోటీగా ఎలక్షన్ మీటింగ్ లు పెట్టే అవకాశం ఉంది. పోటీ మాత్రం, ప్రధానంగా ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్ మధ్యలోనే ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.