Tragedy : విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య.. ప్రాజెక్టులో గల్లంతై మరో నలుగురి యువకుల మృతి !
Tragedy : పండుగ పూట పలు చోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ తార్నాకలోని ఓ అపార్ట్ మెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ కోటిపల్లిలో ప్రాజెక్టులో నీటిలో గల్లంతై నలుగురు యువకులు మృతి చెందారు.
Tragedy : సంక్రాంతి పండుగ పూట పలు చోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ తార్నాకలోని ఓ అపార్ట్ మెంట్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఘటనలో.. వికారాబాద్ కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన నలుగురు యువకులు నీటిలో గల్లంతై మృతి చెందారు.
హైదరాబాద్ లోని తార్నాకలో పండుగ పూట విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సంక్రాంతి సంబరాల్లో అంతా ఆనందంగా గడుపుతున్న వేళ.. ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురిచేసిన ఈ ఘటన.. హైదరాబాద్ తార్నాకలోని ఓ అపార్ట్ మెంట్ లో చోటుచేసుకుంది. కుటుంబం అంతా ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుల్లో దంపతులు, నాలుగేళ్ల బాలిక సహా మరో మహిళ ఉన్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు స్థానికులని ప్రశ్నిస్తున్నారు.
మృతులు ప్రతాప్ (34), సింధూర (32), ఆద్య (4), రాజపతిగా గుర్తించారు. చెన్నైకి చెందిన ప్రతాప్ కుటుంబం.. ఉద్యోగ రిత్యా హైదరాబాద్ లో ఉంటున్నారని స్థానికులు తెలిపారు. ప్రతాప్ ఓ కార్ షోరూమ్ లో డిజైనర్ మేనేజర్ గా పనిచేస్తుండగా.. సింధూర ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్ అని తెలిపారు. భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకి తెలిపారు. ఈ నేపథ్యంలో... నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా ? లేక వారిని చంపిన తర్వాత ప్రతాప్ బలవన్మరణానికి పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో... వికారాబాద్ జిల్లాలో నలుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. జిల్లాలోని కోటిపల్లి ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన సందర్భంలో ఓ యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. అతడిని రక్షించేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు యువకుల మృతితో మన్నెగూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండుగ పూట సరదాగా బయటకు వెళ్లిన పిల్లలు... తిరిగిరాని లోకాలకు వెళ్లారన్న వార్తతో.... మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.