EveningClinics : తెలంగాణలో ఈవినింగ్ క్లినిక్స్.....!
తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో సాయంత్రం నాలుగ్గంటల నుంచి ఆరుగంటల వరకు స్పెషాల్టీ క్లినిక్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వాసుపత్రులకు సర్క్యూలర్ జారీ చేశారు.
తెలంగాణలో ఇకపై సాయంత్రం పూట స్పెషాలిటీ క్లినిక్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మధ‌్యాహ్నం రెండు గంటల వరకు ఔట్ పేషెంట్ సేవలు అందుతున్నాయి. ఆ తర్వాత వైద్యులు బోధనా విధులకు హాజరవుతుంటారు. ఈవినింగ్ క్లినిక్‌ల అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు సమీక్ష నిర్వహించింది. టీచింగ్ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ క్లినిక్ సేవల్ని సాయంత్రం పూట అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
దూర ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం టీచింగ్ ఆస్పత్రులకు వచ్చే రోగులు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న తర్వాత డాక్టర్‌ను సంప్రదించడానికి మరో రోజు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. వైద్యుల్ని కలవడానికి ఓ రోజు ఎదురు చూడాల్సి రావాల్సిన పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి రావడంతో పరిష్కార మార్గాలను ఆలోచించారు.
దూర ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే రోగులు ఆస్పత్రి ఓపీ సమయం ముగిసే సమయానికి వచ్చినా ఉపయోగం ఉండట్లేదు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారంగా ఈవినింగ్ క్లినిక్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య సేవల కోసం వచ్చే పేదలు ఆస్పత్రుల్లో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఈవినింగ్ క్లినిక్ సేవలు వినియోగించుకోవచ్చు. తెలంగాణలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈవినింగ్ క్లినిక్స్‌లో పనిచేసే వారి పనివేళల్ని సర్దుబాటు చేయనున్నారు. ఉదయం పూట రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే రోగులు ఆ రిపోర్టులను సాయంత్రం పూటట వైద్యులకు చూపుకోడానికి వీలవుతుంది. ఒక్కరోజులోనే రోగులకు అవసరమైన చికిత్స, వ్యాధి నిర్ధారణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వ బోధనాసుపత్రుల వైద్యుల సంఘం అభ్యంతరం చెబుతోంది. సాయంత్రం క్లినిక్‌ల అవసరమేమిటని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్షంగా పని వేళలల్ని ఎలా మారుస్తారని ప్రశ్నించింది. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది.మరోవైపు ప్రైవేట్ క్లినిక్‌లలో పనిచేయడం కోసమే వైద్యులు ఈవినింగ్ క్లినిక్‌లను వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
టాపిక్