Election King Padmarajan : కేసీఆర్ పై పోటీకి ఎలక్షన్ కింగ్ పద్మరాజన్ రెడీ, గజ్వేల్ లో నామినేషన్ దాఖలు
Election King Padmarajan : ఎలక్షన్ కింగ్ ఎం.పద్మరాజన్ తెలంగాణ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈసారి సీఎం కేసీఆర్ పైన పోటీ చేసేందుకు గజ్వేల్ లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Election King Padmarajan : దేశంలో రికార్డు స్థాయిలో ఎన్నికల్లో పోటీ చేసి ఎలక్షన్ కింగ్ గా పేరుమోసిన, ఎం.పద్మరాజన్ మొట్టమొదటి సారిగా తెలంగాణ ముఖ్యమంత్రి పైన పోటీ చేస్తున్నారు. నిన్న పద్మరాజన్ తన నామినేషన్ పత్రాలను గజ్వేల్ లో దాఖలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాకు చెందిన పద్మరాజన్, ఇప్పటి వరకు 236 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. గజ్వేల్ లో తన 237వ నామినేషన్ ను దాఖలు చేశారు. పద్మరాజన్ ఇప్పటి వరకు ఐదు సార్లు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో, ఐదు సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. 1986లో అతడు మొట్టమొదటి సారిగా తమిళనాడులోని సేలం జిల్లాలో ఉన్న మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. టైర్ల బిజినెస్ లో ఉన్న పద్మరాజన్, ఎన్నికల్లో ఎంత సాధారణ వ్యక్తయినా పోటీచేయొచ్చు అని నిరూపించడానికే తాను ఎన్నికల బరిలో ఉంటున్నానని తెలిపారు.
ప్రధానమంత్రులు ,రాష్ట్రపతుల పైన పోటీ
పద్మరాజన్ భారత దేశ ప్రధానమంత్రులు పీవీ నరసింహ రావు, అటల్ బిహారి వాజపేయి, మన్మోహన్ సింగ్ పైన లోక్ సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో, ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభ పాటిల్, ఏపీజే అబ్దుల్ కలాం, కేఆర్ నారాయణ్ ఎన్నికల్లో రాష్ట్రపతిగా గెలిచినప్పుడు, పద్మరాజన్ కూడా నామినేషన్లు వేశారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎన్నికలే కాదు, చాలా మంది ముఖ్యమంత్రుల పైన కూడా పోటీచేశారు. తమిళనాడుకు చెందిన ఎంకే కరుణానిధి, జయలలిత పైన కూడా పోటీ చేశారు. 1991లో నంద్యాలలో, పీవీ నరసింహరావు కు వ్యతిరేకంగా తాను పోటీ చేసినప్పుడు, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేశారని, తరువాత వదిలిపెట్టారని చెపుతుంటారు పద్మరాజన్. అయితే, వారు ఎవరో తనను ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా తనకు తెలియదని అంటారు.
ఎక్కువసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా రికార్డు
ఈ 64 సంవత్సరాల పద్మరాజన్, ఏ ఎన్నికల్లో కూడా గెలుపొందలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిగా, పద్మరాజన్ పేరు మోశారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుతో పాటు పలు రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు. ఇప్పటి వరకు తాను ఎన్నికల్లో రూ.30 లక్షల వరకు ఖర్చుపెట్టానని చెప్పే పద్మరాజన్, డబ్బులు లేనప్పుడు తన భార్య పుస్తెలతాడు కూడా కుదువ పెట్టి నామినేషన్లు వేసిన రోజులు ఉన్నాయంటారు. తాను ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి డిపాజిట్ కోల్పోయిన పద్మరాజన్, 2011 మెట్టూరు ఎన్నికల్లో పోటీచేసినప్పుడు తనకు అత్యధికంగా 6,773 ఓట్లు పోలయ్యాయని చెప్పారు. 2019 ఎన్నికల్లో వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పైన పోటీచేసిన, పద్మరాజన్ కు 1,850 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరుకు 32 లోక్ సభ, 50 రాజ్య సభ ,75 అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పలు ఎన్నికల్లో పోటీచేశారు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రిపై పోటీచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.