ED Raids in Telangana: పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు
ED Raids in Telangana: ఈడీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ సారి మెడికల్ కాలేజీలే టార్గెట్గా దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ED Raids in Private Medical Colleges: తెలంగాణలో మళ్లీ ఐటీ, ఈడీ దాడుల దాడులు తెరపైకి వస్తున్నాయి. గతేడాది భారీస్థాయిలో ఈడీ, ఐటీ సోదాలు జరగగా... ప్రధానంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు విచారణకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో… పలు పత్రాలను తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే…. బుధవారం ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మహబూబ్ నగర్, హైదరాబాద్లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రిసర్చ్ సెంటర్, కామినేని, ప్రతిమ తదితర కళాశాలలో ఏకకాలంలో రైడ్స్ చేపట్టారు.
మొత్తం ఆరుకు పైగా కాలేజీల్లో 11 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కామినేని ఆసుపత్రి ఛైర్మన్ సూర్యనారాయణ, ఎండీ శ్రీధర్ నివాసాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లోని ప్రతిమా కాలేజ్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈడీ బృందాలతో పాటుగా సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాల్లో ఈడీ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడుల వెనక ఉన్న కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది.
ఇదే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలే బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ ఇళ్లలో సోదాలు జరిగాయి. గతంలో కూడా బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలపై ఐటీ సోదాలు సంచలనం సృష్టించింది. మంత్రి మల్లారెడ్డిపై సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలు, కాలేజీలతో పాటు ఆయన కుమారుడు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. ఫలింతగా ఆయన ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల్లో కూడా ఈ సోదాలు జరగటమే కాదు... ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరయ్యారు. ఓ దశలో తమనే టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తున్నాయంటూ... బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది. ఆందోళనలు కూడా చేపట్టింది.
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం మోగనున్న నేపథ్యంలో.... ఈ ఐటీ సోదాలతో పాటు మెడికల్ కాలేజీలపై ఈడీ దాడులు జరగటం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇవి ఇంతటితోనే ఆగుతాయా..? లేక మున్ముందు మరిన్ని ఉంటాయా అనేది చూడాలి.
సంబంధిత కథనం