Congress Meeting At Karimnagar: గుజరాత్, తెలంగాణ కాదు... ఛత్తీస్ఘడ్ మోడల్ కావాలి
congress sabha at karimnagar: బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణిక్రావు ఠాక్రే తో పాటు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
Congress Public Meeting At Karimnagar: బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఛత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగేల్... రెండు ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని విమర్శించారు. తమ రాష్ట్రంలోని ప్రతి రైతుకు 9వేలు అందిస్తున్నామని చెప్పారు. కానీ తెలంగాణలో కేవలం ఎకరానికి 5వేలు ఇస్తున్నారని విమర్శించారు. గుజరాత్ మోడల్ అంటే కేవలం గుజరాత్ మాత్రమే అని.. కాంగ్రెస్ మోడల్ అంటే పేదల అభివృద్ధి అంటూ ప్రసంగించారు. మహిళలు, రైతులు, యువకులు, కార్మికులతో పాటు అన్నివర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు.
ఈ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి... బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చారని.. అదే మాటను నిజం చేశారని గుర్తు చేశారు. ఆత్మబలిదానాలతో పాటు సుదీర్ఘ పోరాటాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. సమైక్య పాలకులు రాష్ట్ర ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ... సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. నిజంగా రాజకీయాల గురించి సోనియాగాంధీ ఆలోచిస్తే రాష్ట్ర ఏర్పాటు జరిగేది కాదన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. కానీ ఇలాంటి రాష్ట్రం ఎవరి పాలయిందో ఆలోచించాలని ప్రజలను కోరారు. సబ్బండ వర్గాలు ఆత్మగౌరవం నిలబెట్టందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందన్నారు.
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక... తప్పుడు హామీలతో పబ్బం గడుపుతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేజీ టూ పీజీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చారా..? అని నిలదీశారు. నాడు కరీంనగర్ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకర్... తెలంగాణ కోసం పోరాడి సాధించారని చెప్పారు. కానీ బండి సంజయ్ ఏం చేశారని నిలదీశారు. అసలు కరీంనగర్ కోసం బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్, తెలంగాణ మోడల్ కాదని… ఛత్తీస్ఘడ్ మోడల్ కావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని… అధికారంలోకి వచ్చాక రుణమాఫీ, ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల సాయం చేస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేశ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీహెచ్ తో పాటు పలువురు నేతలు… బీఆర్ఎస్ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరారు.