Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ-cm revanth reddy will meet representatives of foxconn and apple in delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ

Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ

Basani Shiva Kumar HT Telugu
Aug 15, 2024 01:43 PM IST

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఫాక్స్‌కాన్‌ - యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

ఢిల్లీకి రేవంత్ రెడ్డి
ఢిల్లీకి రేవంత్ రెడ్డి (Revanth Reddy (X))

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఫాక్స్‌కాన్‌-యాపిల్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి డిసెంబర్ 26, 2023న సెక్రటేరియట్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్​లో ఉన్న ఫాక్స్​కాన్ కంపెనీ నిర్వహణకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకూ సహకరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జరగబోయే భేటీలో ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

బెంగళూరుకు ఫాక్స్‌కాన్..

యాపిల్ ఫోన్, అనుబంధ పరికరాలు తయారు చేసే ఫాక్స్​కాన్‌కు.. కొంగర కలాన్​లో గత ప్రభుత్వం దాదాపు 120 ఎకరాలు కేటాయించింది. లక్ష ఉద్యోగాలు కల్పించేలా ఫాక్స్​కాన్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే.. ఫాక్స్ కాన్‌ను బెంగళూరుకు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. కానీ.. ఎన్నికల తర్వాత ఆ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని రేవంత్ రెడ్డి వారికి వివరించారు.

పెట్టుబడుల సాధన కోసం..

ఇటు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం జరిపిన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందని రేవంత్ రెడ్డి వివరించారు. 19 అగ్రశ్రేణి కంపెనీలతో చర్చలు జరిపామని చెప్పారు. 31వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. తద్వారా 30 వేల మందికి పైగా నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్న సీఎం. తెలంగాణను ఫ్యూచర్ సిటీగా ప్రపంచానికి ఈ పర్యటన ద్వారా పరిచయం చేశామని చెప్పుకొచ్చారు. ఇదొక గొప్ప ముందడుగని.. భవిష్యత్తులో తెలంగాణ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ..

భవిష్యత్తులో తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారబోతోందని రేవంత్ రెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో రూ.31,502 కోట్లు, దక్షిణ కొరియాలో రూ.4,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. రెండు దేశాల్లో కలిపి 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అటు దావోస్​ పర్యటనలో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో రూ.40,232 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొచ్చాయి. కేవలం ఈ 8 నెలల కాలంలోనే తెలంగాణకు రూ.81,564 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Whats_app_banner