BRS Vs BJP : బీఆర్ఎస్, బీజేపీ మధ్య 'ఖమ్మం' ఫైట్.. కీలకం కానున్న జనవరి 18 !
BRS Vs BJP : రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా ఖమ్మం జిల్లాపై ఫోకస్ అయ్యాయి. జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రెడీ అవుతోండగా.. అదే రోజు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవనున్నారు. షా సమక్షంలోనే పొంగులేటి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.
BRS Vs BJP : తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. తన రాజకీయ కార్యచరణను వేగవంతం చేస్తున్నారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తొలి బహిరంగ సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొలి సభను ఢిల్లీలో నిర్వహించాలని గతంలో భావించినా... ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. సభ నిర్వహణకు ఖమ్మంను ఎంచుకున్నారు బీఆర్ఎస్ బాస్. మరోవైపు... గులాబీ అధినేత వ్యూహాలకు ఎప్పటికప్పుడు కౌంటర్ లు ఇస్తూ వస్తోన్న బీజేపీ.. మరోసారి కేసీఆర్ కి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఖమ్మంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించే రోజే... ఆ జిల్లాకు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షాను కలవనున్నారు.
టిఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో.. కేసీఆర్ ఖమ్మం సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సూచనగా సభ నిర్వహణ ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా.. ఢిల్లీ సీఎం, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున... జాతీయ విస్తరణ ప్రణాళికను లాంఛనంగా ప్రారంభించేందుకు ఖమ్మం ఉత్తమ వేదిక అని.. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సారూప్యత కలిగిన రాజకీయ పార్టీల ఐక్యతను ఈ వేదిక ద్వారా చాటిచెబుతామని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు... ఖమ్మం బీఆర్ఎస్ వ్యవహారాలు ఇటీవల హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో... జిల్లాలో పార్టీ తీరుపైనా దృష్టి సారించారు కేసీఆర్. జిల్లా నేతలను హైదరాబాద్ కు పిలిపించుకొని... ప్రగతి భవన్ లో చర్చలు జరిపారు. ఖమ్మంలో తలపెట్టిన భారీ బహిరంగ సభపై దిశానిర్దేశం చేసిన కేసీఆర్... అదే సమయంలో జిల్లా పార్టీలో నెలకొన్ని పరిస్థితులపైనా ఆరా తీసినట్లు సమాచారం. మాజీ ఎంపీ, సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతున్నందున... ఆయన వెంట వెళ్లే నేతలు ఎంత మంది,తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై జిల్లా నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి సహా.. ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ ఛైర్మన్ కమల్ రాజ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.
ఖమ్మం సభతో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ రాజకీయాలను వేగవంతం చేయాలని చూస్తోన్న కేసీఆర్ కి.. ఆదిలోనే షాక్ ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయింది. చాలా రోజులుగా గులాబీ పార్టీపై అసంతృప్తితో ఉంటూ... గత కొన్ని రోజులుగా అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇప్పటికే ఈ అంశంలో పొంగులేటితో చర్చలు జరిపిందని... ఆయన పార్టీ మారేందుకు కూడా సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా.... బీఆర్ఎస్ ఖమ్మం సభ జరిగే జనవరి 18నే... పొంగులేటి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కమలం పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అనంతరం.. జనవరి 19న రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పొంగులేటి కలిసే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా కమలం గూటికి చేరినవెంటనే... ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సైతం... పొంగులేటి ఇప్పటికే ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఆయన వెంట భారీ సంఖ్యలో నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరతారని ఖమ్మంలో చర్చ నడుస్తోంది.