Bomb blast for Money: డబ్బులు ఇవ్వాలని బాంబు పేల్చి బెదిరింపు..హనుమకొండ జిల్లాలో కలకలం-bomb threats and threats to extort money in hanumakonda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bomb Blast For Money: డబ్బులు ఇవ్వాలని బాంబు పేల్చి బెదిరింపు..హనుమకొండ జిల్లాలో కలకలం

Bomb blast for Money: డబ్బులు ఇవ్వాలని బాంబు పేల్చి బెదిరింపు..హనుమకొండ జిల్లాలో కలకలం

HT Telugu Desk HT Telugu
Dec 29, 2023 06:14 AM IST

Bomb blast for Money: డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.

డిటోనేటర్‌ పేల్చి బెదిరింపులు
డిటోనేటర్‌ పేల్చి బెదిరింపులు (unsplash)

Bomb blast for Money: ఇంటి అవసరాల కోసం ఇసుక పోయించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి.. జిలెటిన్​ స్టిక్స్​ పేల్చి అవతలి వ్యక్తిని చంపినంత పని చేశాడు. ఒక్క సారిగా బాంబు శబ్ధంతో ఉలిక్కిపడిన జనాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ధర్మసాగర్​ మండల కేంద్రానికి చెందిన యాట జనార్ధన్​ స్థానికంగా ఓ హోటల్​ నడుపుకుంటున్నాడు. కొద్దిరోజుల కిందట తన ఇంటి అవసరం నిమిత్తం స్థానికంగా ఇసుక బిజినెస్​ చేసే దారంగుల శ్రీను వద్ద ఒక ట్రాక్టర్​ లోడ్​ ఇసుక పోయించుకున్నాడు.

ఇసుకకు సంబంధించిన డబ్బులు నాలుగు రోజుల్లోగా చెల్లిస్తానని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం జనార్థన్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పలుమార్లు డబ్బుల అడిగిన శ్రీను సహనం కోల్పోయాడు.

హోటల్​ లో బాంబు పేల్చి

జనార్ధన్​ ను ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో దారంగుల శ్రీను విసుగెత్తిపోయాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం మరోసారి జనార్ధన్​ నడిపే హోటల్​ వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. దీంతో జనార్ధన్​ మళ్లీ వాయిదా అడిగాడు.

దీంతో చిరెత్తిపోయిన శ్రీను ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. గొడవ పెద్దవడంతో అక్కడి నుంచి శ్రీను వెళ్లిపోయి.. తన బంధువులైన వల్లపు మధు, ప్రశాంత్​, రమేశ్​, రఘు, బన్నీని హోటల్​ వద్దకు తీసుకొచ్చాడు.

డబ్బులు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నావంటూ వాళ్లంతా జనార్ధన్​ తో గొడవ పడ్డారు. జనార్ధన్​ కూడా వారితో వాదనకు దిగాడు. దీంతో శ్రీను, అతని బంధువులు అప్పటికే తమ వెంట తెచ్చుకున్న జిలెటిన్​ స్టిక్స్​ ను డిటోనేటర్​ సాయంతో అంటించి హోటల్​ పడేశారు. దీంతో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది.

పేలుడులో హోటల్​ లో ఉన్న సామాగ్రి చాలావరకు ధ్వంసమైంది. అక్కడే ఉన్న జనార్ధన్​, అతడి భార్య, పిల్లలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. పేలుడు శబ్ధంతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళన చెందారు.

ఇరువురిపైనా కేసు

జిలెటిక్​ స్టిక్స్​ పేల్చి తనను చంపాలని చూడటంతో భయపడిపోయిన జనార్ధన్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను తన హోటల్​ లోనే చంపే ప్రయత్నం చేశారని, శ్రీనుతో పాటు అతనికి సహకరించిన అతని బంధువులపైనా చర్యలు తీసుకోవాలంటూ ధర్మసాగర్​ పోలీస్ స్టేషన్​ లో కంప్లైంట్​ ఇచ్చాడు. దీంతో జనార్ధన్​ ఫిర్యాదు మేరకు శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

డబ్బులు అడగడానికి వెళ్లిన తనపై జనార్ధన్​ తో పాటు అతి సోదరులు యాట రాజు, సన్నీ, సాయి దాడి చేశారని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని దారంగుల శ్రీను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రీను ఇచ్చిన ఫిర్యాదుతో జనార్ధన్​ పై కూడా కేసు ఫైల్​ చేశారు. కాగా ఇరువురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని ధర్మసాగర్​ సీఐ శ్రీధర్​ రావు వివరించారు.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner