Bhadrachalam Kalyanam Live : భద్రాద్రి సీతారాముల కల్యాణం లైవ్ పై సస్పెన్స్, ఈసీ ఆంక్షలు సడలిస్తుందా?
Bhadrachalam Kalyanam Live : భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రత్యక్ష ప్రసారాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఈసీకి లేఖ రాసింది.
Bhadrachalam Kalyanam Live : కన్నుల పండుగగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని(Bhadradri Seetharamula Kalyanam Live) టీవీలో వీక్షించే అవకాశం ఉందా? లేదా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దక్షిణ భారతదేశ అయోధ్య(Southern Ayodhya)గా కొలుచుకునే భద్రాచల పుణ్య క్షేత్రంలో వైభవంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకను ప్రత్యేక ప్రసారాల ద్వారా ప్రతి సంవత్సరం టీవీల్లో వీక్షించేవారు. కాగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయాలంటూ నిబంధనలు విధించింది. ఈ క్రమంలో సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈసీకి లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఈ అంశంపై లేఖ రాశారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పిస్తుందని, ఎన్నికల నిబంధన పేరుతో ఈ అవకాశానికి అడ్డు తగలవద్దని లేఖలో పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవించడం అందరి బాధ్యత అని, ఎన్నికల సంఘం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రసారాలకు అనుమతి ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే సీఈవో వికాస్ రాజ్ నుంచి ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతించని పక్షంలో సీతారాముల కల్యాణాన్ని భక్తులు టీవీల్లో(Seetharamula Kalyanam TV Live) వీక్షించే అవకాశాన్ని కోల్పోనున్నారు.
హాజరుకానున్న గవర్నర్
భద్రాద్రి రామయ్య కల్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి (Chief Minister)సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా భద్రాద్రి రామయ్యకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను తీసుకొస్తారని అందరూ ఆశించారు. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(Governor CP Radhakrishnan) ఈ హోదాలో రాముల వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం