Bandi Sanjay: తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి విమోచన దినం జరపడం లేదన్న బండి సంజయ్-bandi sanjay questions why govt is not celebrating telangana liberation day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి విమోచన దినం జరపడం లేదన్న బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి విమోచన దినం జరపడం లేదన్న బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Sep 17, 2024 08:05 AM IST

Bandi Sanjay: ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజా పాలన దేనికోసం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై  కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay: ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదన్నారు. పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని, నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.

భగవన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా కరీంనగర్ లోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పాత బజార్ నెంబర్ వన్ వినాయకుడి విగ్రహం పూజలు నిర్వహించి శోభాయాత్ర ప్రారంభించారు.

ట్రాక్టర్ నడుపుతూ గణేష్ శోభాయాత్ర లో సంజయ్ పాల్గొన్నారు. విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి గొడవ లేకుండా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీతో చర్చించి ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. హిందువుల పండుగలపై వివక్ష చూపుతున్నారనే భావన హిందువుల్లో నెలకొందని, ఆ భావనను తొలగించేలా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.

దమ్ముంటే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహించండి

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి తాము హాజరు కావడం లేదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతానని స్పష్టం చేశారు. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్ లో అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మహత్తర ఘటనపై ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రజాకార్ల దళం స్రుష్టించిన పార్టీయే ఎంఐఎం అని, ఆ పార్టీకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నయని విమర్శించారు.

నాటి యోధుల త్యాగాలను మర్చిపోయి, ఓట్ల కోసం రజాకార్ల పార్టీని సంకనేసుకుని తిరుగుతుండం సిగ్గు చేటన్నారు. రజకార్ పార్టీ వారసుడు ఒవైసీ ప్రభుత్వ భూములను కబ్జా చేసి పేదలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఒవైసీని సిగ్గు లేకుండా పేదల పక్షపాతి అని పొగడం సిగ్గు చేటని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కూల్చకుండా ఒవైసీకి వంతపాడుతున్నారని విమర్శించారు.‌

సర్దార్ రియల్ హీరో...

సర్దార్ పటేల్ మాకు వీరుడే... పటేల్ వారుసలం మేమే. తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయి పటేల్ ముమ్మాటికీ బీజేపీకి రియల్ హీరో అని బండి సంజయ్ కొనియాడారు. ఆ పటేల్ వారసులమని చెప్పుకునేందుకు మేం గర్వపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోక వస్తే హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

గ్యారంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి...

6 గ్యారంటీలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే 6 గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి? ఎంత మంది లబ్ది పొందారు.? ఎన్ని నిధులు ఖర్చు చేశారనే అంశంపై దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. చేతనైతే 6 గ్యారంటీలపై ప్రజల్లో చర్చ పెట్టాలే తప్ప విగ్రహాల లొల్లి సిగ్గు చేటన్నారు.

కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంపై.... ఇక్కడ కేసీఆర్ కుటుంబం ఖాళీగానే ఉంది కదా. ఆయన కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆ పదవి ఇస్తారేమో. ఎందుకంటే ఇద్దరిదీ లిక్కర్ కేసే. వారి విధానాలు, బంధాలు, వ్యాపారాలు ఒక్కటే. అందుకే కేసీఆర్ కుటుంబంలో ఒకరికి సీఎం పదవి ఇస్తారేమోనని వ్యంగ్యంగా విమర్శించారు.

మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను విస్త్రతంగా నిర్వహించాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner