ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి - రైల్వేమంత్రిని కోరిన బండి సంజయ్-bandi sanjay kumar requested railway minister to give permission for the karimnagar hassanparthi railway line ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి - రైల్వేమంత్రిని కోరిన బండి సంజయ్

ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి - రైల్వేమంత్రిని కోరిన బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 10:23 AM IST

కరీంనగర్– హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖను అందజేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ...
రైల్వే మంత్రితో బండి సంజయ్ భేటీ...

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే లైన్లు, ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల హాల్టింగ్, స్టేషన్ ల ఆధునీకరణ పై చర్చించారు. ఇందుకు సంబంధించి విజ్ఞప్తి లేఖను అందజేశారు.

ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయండి - బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రిని బండి సంజయ్ కోరారు. జమ్మికుంట స్టేషన్ వద్ద దక్షిణ ఎక్స్ ప్రెస్ రైలు ఆగేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా లేఖను కూడా ఇచ్చారు.

ఉప్పల్ స్టేషన్ అప్ గ్రేడ్ లో భాగంగా ప్లాట్ ఫాం, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని కోరారు. కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలన్నారు. ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన సౌకర్యాలను మెరుగుపర్చాలని, పార్కింగ్ ను విస్తరించాలని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సోలార్ ప్యానెళ్లను అమర్చాలని, టిక్కెట్ కౌంటర్, లగేజీ నిర్వహణ వ్యవస్థను మెరుగుపర్చాలని లేఖలో ప్రస్తావించారు.  ప్రజలకు ఎంతో మేలు కలిగించే ఉప్పల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయాలని విజ్ఝప్తి చేశారు.

కొత్త లైన్ కు అనుమతిపై విజ్ఞప్తి…

కరీంనగర్– హసన్ పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టు పూర్తి నివేదిక (డీపీఆర్) సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను బండి సంజయ్ కోరారు. కరీంనగర్ నుండి హసన్ పర్తి వరకు 61.8 కి.మీల మేరకు నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1415 కోట్లు వ్యయం అవుతుందని.. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు.

రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్ లో ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. తక్షణమే ఆమోదం తెలపాలని కోరారు. కొత్త రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనన్నారు. కరీంనగర్ – వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్దిక వృద్దికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner