Bachupally Narayana College : నారాయణ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య, ఈ ఘటనపై ప్రభుత్వ సీరియస్ గా ఉందన్న నేరెళ్ల శారద
Bachupally Narayana College : బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇటీవల ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, ఆదివారం తిరిగి హాస్టల్ వచ్చిన విద్యార్థిని అదే రోజులు రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. బాలికను హాస్టల్ లో డ్రాప్ చేసి ఇంకా ఇంటికి చేరకుండానే... తల్లిదండ్రులు బాలిక మరణవార్త విని కన్నీరు మున్నీరుగా రోధించారు. అయితే బాలిక తల్లిదండ్రులు రాకుండా... ఆమె మృతదేహాన్ని పోలీసుల సహాయంతో నారాయణ కాలేజీ సిబ్బంది గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. కాలేజీ ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద స్పందించారు. ఇటీవల ఈ కాలేజీలో పర్యటించి విద్యార్థినిల సమస్యలు అడిగి తెలుసుకున్నానన్నారు. ఇంతలోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతో బాధించిందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ ఉందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల్లో తనిఖీల గురించి సీఎం రేవంత్ రెడ్డి తనతో మాట్లాడారన్నారు. కాలేజీలు ఇంటర్ బోర్డు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, ఇతర నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా? అనేది పరిశీలిస్తున్నామన్నారు.
నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అనూష ఆత్మహత్యపై నేరెళ్ల శారద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల కింద ఈ కాలేజీ, హాస్టల్ ను తనిఖీ చేస్తే విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ సమస్యలపై దృష్టిపెట్టాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించామని, అయినా వారు పట్టించుకోలేదన్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాలేజీల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ఉన్నారన్నారు. బాధ్యులపై చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
"ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులతో మాట్లాడాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం, అధికారులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, ఎలా పరిష్కరించాలనే ఉద్దేశంలో మేము ఉన్నాం. ఇంటర్ బోర్డు, అధికారులతో మాట్లాడుతున్నాం. ఈ క్రమంలో నిబంధనలు పాటించని కాలేజీలకు నోటీసులు ఇస్తున్నాం. ఒక అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయారు. మీకు ఇన్స్టిట్యూషన్ నడిపే అర్హత ఉందా? అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. విద్య కోసం మీ దగ్గరకు వచ్చిన ఆమె పూర్తి బాధ్యత మీదే. వారి చదువుతో పాటు జీవితం కూడా మీదే బాధ్యత" - నేరెళ్ల శారద, మహిళా కమిషన్ ఛైర్మన్
అసలేం జరిగింది?
హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా...వీరిలో రెండో కుమార్తె అనూష (16) బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది.
దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన అనూషను ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు హాస్టల్లో వదిలివెళ్లారు. తల్లిదండ్రులు నగరం దాటేలోపే అనూష స్పృహ కోల్పోయిందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లేసరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని నారాయణ సిబ్బంది తెలిపారు. తల్లిదండ్రులు వచ్చేసరికి విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ సిబ్బంది, బాచుపల్లి పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ బిడ్డ అనూష ఆత్మహత్యకు నారాయణ కాలేజీ సిబ్బందే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూష మృతిపై ఆమె తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత కథనం