Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన ఆశా వర్కర్ లు,ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆశావర్కర్ల సమస్యలపై కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం అమలు చేయాలని కోరారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామ కృష్ణాకలనీలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు ఆశావర్కర్లు బండి సంజయ్ ను కలిసి తమ సమస్యల పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఆశావర్కర్లు కనీస వేతనాన్ని రూ.18వేలు చేయాలని, పెండింగ్ పీఆర్సీ ఎరియర్స్, కరోనా రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని 15 రోజులు సమ్మె చేస్తే... దిగొచ్చిన ప్రభుత్వం పలు హామీలిచ్చిందన్నారు. చివరకు సమ్మె కాలపు వేతనం చెల్లింపు మినహా ఇతర హామీలేవీ నేటికీ అమలు కాలేదని వాపోయారు. ఈ అంశంపై ఎన్నిసార్లు ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్ ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. దీంతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను కూడా చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా...
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి దేశ భక్తిని చాటి చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ శ్రేణులను కోరారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండాను ఎగిరేసేలా ప్రజలను చైతన్యపర్చాలని కోరారు.
కరీంనగర్, మానకొండూర్, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బండి సంజయ్ హర్ ఘర్ తిరంగా జెండా పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ కమిటీ మొదలు రాష్ట్రస్థాయి నాయకుడి వరకు పార్టీ జెండాలను పక్కనపెట్టి దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమన్నారు.
పంద్రాగస్టు వరకు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా దేశభక్తుల ఫొటోలుగా వాట్సప్ డీపీలుగా పెట్టుకోవాలని కోరారు. పోలింగ్ బూత్ అధ్యక్షులు తప్పనిసరిగా తమ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండా కొనేలా చేసి పంద్రాగస్టు రోజు ఆయా ఇండ్లపై ఎగరేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. అందులో భాగంగా ప్రతి బీజేపీ కార్యకర్త కనీసం 50 మందికి తగ్గకుండా ఫోన్లు చేయడంతోపాటు జాతీయ జెండా ఎగరేయాలని కోరుతూ వంద మందికి సందేశాలు పంపాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నెలకొల్పిన జాతీయ నేతల విగ్రహాలను శుద్ది చేయాలని సూచించారు.
కరీంనగర్ లో నేడు తిరంగ్ యాత్ర
దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో భాగంగా ఈనెల 12న ఉదయం 10 గంటలకు కరీంనగర్ లో నిర్వహించే ‘‘తిరంగా యాత్ర’’లో తాను పాల్గొంటానని బండి సంజయ్ తెలిపారు. మరో వైపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో 80 శాతానికి పైగా ఓట్లు పోలైన పోలింగ్ బూత్ ల ఎంపిక పూర్తయ్యిందని, పంద్రాగస్టు తరువాత ఆయా పోలింగ్ బూత్ కమిటీలను సన్మానించడంతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)