Aghori in Kondagattu: అఘోరీ హల్ చల్... కొండగట్టు ను సందర్శించిన నాగసాధు
Aghori in Kondagattu: ఒళ్ళంతా విభూది... ఒంటిపై వస్త్రాలు లేకుండా మహిళా అఘోరీ హల్ చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకున్నారు. స్మశాన వాటికకు వెళ్ళి దహనం అవుతున్న శవం చుట్టు ప్రదక్షిణ చేశారు. తన ప్రత్యేకతను చాటుకుని వెళ్ళిపోయారు.
Aghori in Kondagattu: డేంజర్...అఘోరీ...నాగసాదు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్న కారు... ఆ కారు డాష్ బోర్డుపై పుర్రెలు... ఆ కారులో తిరుగుతూ ఉత్తర తెలంగాణాలో మహిళా అఘోరీ (నాగసాధు) హల్ చల్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కు చేరుకుని శ్రీ ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. అఘోరీ పూజలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మహిళా అఘోరీ లోక కళ్యాణార్థం కోసమే ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. త్వరలో కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేకంగా ఓ ఆశ్రమం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వివరించిన ఆమె మానవ సేవ కంటే ప్రకృతి సేవే ముఖ్యమన్నారు.
ఆలయాల సందర్శనలో భాగంగా తాను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నానని రాష్ట్రంలోని అన్ని క్షేత్రాలను దర్శించుకుంటానని వెల్లడించారు. హరిద్వార్ క్షేత్రం నుండి తాను దేవాలయాలను సందర్శించేందుకు బయలుదేరినట్టు వివరించారు.
స్మశానంలో పూజల వీడియో విడుదల…
ఆలయంలో పూజలు నిర్వహించిన అఘోరీ వెంట వచ్చిన వారు అంతకు ముందు శ్మశానంలో శవం వద్ద చేసిన ప్రార్థనలకు సంబంధించిన వీడియోను మీడియాకు ఇచ్చారు. అందులో స్మశానంలో అప్పుడే చితి అంటించిన శవం కాలుతుండగా మహిళా అఘోరీ ఆ చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. చితికి ఇరువైపులా పూజలు చేస్తూ దేవున్ని ప్రార్థించింది.
కాలుతున్న చితి కింది భాగం నుండి బూడిదను తీసుకుని ఒళ్లంతా రాసుకుంది. చితికి నాలుగు దిక్కులా తిరుగుతూ బూడిద కలిసిన మట్టిని తీసుకుని ఆకాశంపైకి విసురుతూ పూజలు చేసింది. చితి మంట వద్ద పూజల అనంతరం అక్కడి నుండి వెళ్ళిపోయారు.
ఘోరం జరిగిన రోజే అఘోరీ సందర్శన
సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున కొండగట్టు వద్ద ఓదుర్ఘటన చోటు చేసుకుంది. కొండగట్టు సమీప గ్రామాల నుండి ప్రయాణీకులను గమ్యం చేర్చేందుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కొండగట్టుపై అదుపు తప్పి బోల్తా పడింది. 2019 సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘోర దుర్ఘనలో 65 మంది మృతి చెందగా చాలా మంది క్షతగాత్రులు అయ్యారు. అదే రోజులు అఘోరీ (నాగసాధు) కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వనవాసం నుంచి జనవాసాల్లోకి…
కాశీ, హరిద్వార్ వంటి అత్యంత ప్రాశస్త్యం ఉన్న శైవ క్షేత్రాల సమీపంలో జన సంచారం లేని చోట మాత్రమే నివాసం ఉంటారు. నిత్యం శివనామస్మరణ చేస్తూ శరీరమంతా విభూది పూసుకుని కాలం వెల్లదీస్తుంటారు. వారికి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ప్రత్యేకతలు ఉన్న రోజులు మాత్రమే ఉంటాయి. వీరంతా అవాసం ఉన్న సమీప క్షేత్రంలోని శంకరున్ని దర్శించుకోవాలన్నా కూడా ప్రత్యేక సమయంలో వస్తారని ఆయా క్షేత్రాల్లో చెప్తుంటారు.
మహాకుంభమేళ, కుంభమేళ జరిగినప్పుడు మాత్రమే ఆ నది తీరాల్లో ప్రత్యక్షం అయి ఉత్సవాలు ముగిసే వరకు ఉండి అంతర్థానం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పటి వరకు అఘోరాలు అనగానే పురుషుల గురించి మాత్రమే ఉంటారన్న ప్రచారం జరిగింది. కానీ తాజాగా తెలంగాణలోని వివిధ పుణ్యక్షేత్రాలు మహిళా అఘోరీ సందర్శిస్తుండడం గమనార్హం. అందునా ఐదేళ్ళ క్రితం కొండగట్టు ప్రమాదం జరిగిన రోజునే ఈ అఘోరీ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)