Kawal Wildlife Sanctuary : కవ్వాల్ అభయారణ్యంలో సఫారీ, జన్నారంలో వన్యప్రాణుల సందడి-ఓసారి చూసొద్దామా!
Kawal Wildlife Sanctuary : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం పర్యాటకులను ఆకర్షిస్తుంది. జన్నారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో దుప్పులు, జింకలు, నెమళ్లు, నీలుగాయిలను చూసేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తుంటారు. కవ్వాల్ టైగర్ జోన్లో సఫారీకి ఆసక్తి చూపుతారు.
Kawal Wildlife Sanctuary : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు అభయారణ్యాల్లో ప్రముఖమైంది కవ్వాల్. ఈ అభయారణ్యం మంచిర్యాల, నిర్మల్ రెవెన్యూ డివిజన్ల మధ్య విస్తరించి ఉంది. కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని జన్నారంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో వన్య ప్రాణులను సంరక్షిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చే పర్యాటకులకు వన్యప్రాణులు కనువిందు చేస్తాయి. జన్నారంలోని వన్యప్రాణి సంరక్షణ విభాగంలో దుప్పులు, జింక పిల్లలు, నెమళ్లు, నీలుగాయిలను ఉంచడంతో వీటి సందర్శన కోసం వందలాది మంది పర్యాటకులు ఈ కేంద్రానికి వచ్చి ప్రకృతి అందాలతో పాటు వన్యప్రాణుల మధ్య కాలం గడుపుతూ ఆహాదం పొందుతారు.
సెలవు రోజుల్లో జన్నారం మండల కేంద్రం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్లేదారిలో అర కిలోమీటర్ దూరంలో ఈ జింకల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో ప్రస్తుతం 60 దుప్పులు, 12 సాంబార్లు, 12 నీలుగాయిలున్నాయి. వాటికి అటవీ శాఖ సిబ్బంది ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం ఆహారం అందిస్తారు. వాటి కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన ఆహార ధాన్యాలు తీసుకువస్తారు. అదే విధంగా సమీపంలో ఉన్న చెట్ల ఆకులను వేస్తారు. ఎక్కడో అడవిలో ఉండే వన్యప్రాణులు చెంగుచెంగున ఎగిరే దుప్పులు పర్యాటకులను ఆకర్షస్తున్నాయి.
జన్నారం టైగర్ జోన్ కు చేరుకునే మార్గాలు:
- ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వెళ్లేటప్పుడు మధ్యలో ఉంటుంది.
- మంచిర్యాల నుంచి ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాలకు వెళ్లేవారు మార్గమధ్యలో ఇక్కడా సేద తీరవచ్చు.
- ఇక్కడికి రావడానికి ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్లు, మంచిర్యాల నుంచి 60 కిలోమీటర్లు, నిర్మల్ నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
- ఇక్కడికి వచ్చేందుకు మంచిర్యాల, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ పట్టణాల నుంచి బస్సు సౌకర్యాలున్నాయి. ప్రైవేటు వాహనాలు ద్వారా కూడా రావచ్చు. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
- పర్యాటకులకు బస చేసేందుకు సౌకర్యవంతమైన రిసార్టులు, అధ్యయన కేంద్రం, ఆకట్టుకునే బొమ్మలు కూడా ఉన్నాయి.
- అహ్లాదాన్ని పంచుతున్న అటవీ ప్రాంతం పర్యాటకులకు అనువైన సమయం వర్షాకాలం.
- పచ్చదనం పరుచుకున్న ప్రకృతి వనం లో పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు హరిత రీసార్ట్ సిద్ధం చేశారు.
అభయారణ్యంలో పచ్చని వాతావరణం, పరుగులు తీసే దుప్పులు, జింకలు, నెమళ్లు, పక్షుల కిలకిల రాగాలు, గలగలా పారే సెలయేర్లు, వాగులు వంకలతో అహ్లాదాన్ని తిలకించేందుకు పర్యాటక ప్రేమికులు వస్తుంటారు. కవ్వాల్ టైగర్ జోన్లో ఓపెన్ ట్రాప్ జీపు(సఫారీ)లో సవారీకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు.
పర్యాటక శాఖ ప్రత్యేక సౌకార్యాలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు హరిత రెస్టారెంట్,కాటేజీలు, పర్యాటకులు బస చేసేందుకు సౌకర్యం కల్పించారు.
ఇక్కడికి వచ్చిన పర్యాటకులు జంగిల్ సఫారీ ద్వారా సుమారు 30 కిలోమీటర్ల దూరం అడవిలో ప్రయాణించవచ్చు. అడవిలో ఉదయం పూట 6 గంటల్లోపు వెళితే వన్యప్రాణుల పరుగులు పక్షుల కిలకిలరావాలు వినవచ్చు. దట్టమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య ప్రయాణం, అక్కడక్కడా వన్యప్రాణుల పరుగులు, ఆహ్లాదాన్ని నింపుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో మల్యాల అడవుల్లో అటవీశాఖ నిర్మించిన వాచ్ టవర్ ఎక్కి పరిశీలిస్తే చుట్టూ దట్టమైన అడవులు కనిపిస్తాయి. అదేవిధంగా పలుమార్లు అడవుల్లో సంచరించే పెద్దపులి పర్యాటకులకు కనిపించి ఆందోళన కలిగిస్తోంది.
ఆన్లైన్లో బుకింగ్ ఇలా:
కవ్వాల్ అభయారణ్యానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా పర్యాటక శాఖ సౌకార్యాలు కల్పిస్తోంది. జన్నారం, కడెం మండలాల్లో టూరిజం శాఖ కాటేజీలను నిర్మించింది. జన్నారంలో 9 ఏసీ, 2 నాన్ ఏసీ, సమావేశాలు, చిన్నచిన్న శుభకార్యాలను వినియోగించుకోవడానికి డార్మెటరీ హాళ్లు, రెస్టారెంట్ను నిర్మించింది. కడెం మండలంలో 12 ఏసీ, 2 నాన్ ఏసీ గదులను టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మించి పర్యాటకులకు
అందుబాటులో ఉంచారు. పర్యాటకులు ముందుగా ఆన్లైన్ ద్వారా గదులు బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. www.tsdc.in లో లాగిన్అయి ఎంచుకోవాలి. ఏసీ గదికి రూ.1,654, నాన్ ఏసీ గదికి రూ.1000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం