Nagarjuna Sagar : ఎంత దారుణం.. మహిళను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులు!
Nagarjuna Sagar : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఓ మహిళను చంపేసిన నిందితులు.. ఆత్మహత్యగా చిత్రీకరించారు. దీనిపై మృతురాలి బంధువులు గట్టిగా పోరాడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూ ఇప్పుడు నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు మండలం మొలకలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. 31 ఏళ్ల వయసున్న ఓ మహిళను దారుణంగా చంపేశారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే.. ఆమెది ఆత్మహత్య కాదు.. హత్య అని తాజాగా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఆ మహిళ హత్య కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మహిళను హత్య చేయడానికి గ్రామ పెద్దలు, స్థానిక పోలీసులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసును జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సిరియస్‌గా తీసుకున్నారు. మహిళను హత్య చేసినట్టు నిర్దారణ కావండతో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. మొదట శరీరం అంతా కారం చల్లుతూ తీవ్రంగా కొట్టి.. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
వివాహేతర సంబందం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని సమాచారం. ఈ హత్యలో జాల రాములు, అతని భార్య పార్వతమ్మ, బంధువు వెంకటయ్య ప్రమేయం ఉందని.. మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యకు గురైన మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా.. ఆమె ప్రైవేట్ సంభాషణలను ఓ పోలీస్ అధికారి లీక్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు విషయంలో స్థానిక పోలీసుల తీరు పైనా అనుమానాలు ఉన్నాయని నాగార్జునసాగర్ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అడుగడునా నిందితులను కాపాడుతూ.. పోలీసుల దర్యాప్తు సాగిందని చెబుతున్నారు. బాధితుల తరుపున బలమైన వారు లేకపోవడంతో.. గ్రామ పెద్ద మనుషులు, పోలీసుల వల్ల కేసు పక్కదారి పట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. గుర్రంపోడు ఠాణా ఎదుట ఆందోళన చేశారు.
మహిళ ది హత్యగా నిర్ధారణ అయ్యిందని.. ఈ కేసులో స్థానిక ఎస్సై, సీఐ, గ్రామ పెద్దలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ మృతురాలి బంధువులు, బీఆర్ఎస్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే.. నిందితులకు పోలీసులు సపోర్ట్ చేశారనే ఆరోపణలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.