Warangal News : ప్రాణం తీసిన 'రూపాయి' గొడవ-a man lost his life in a fight over one rupee in warangal city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal News : ప్రాణం తీసిన 'రూపాయి' గొడవ

Warangal News : ప్రాణం తీసిన 'రూపాయి' గొడవ

HT Telugu Desk HT Telugu
Jun 02, 2024 06:53 AM IST

Warangal Crime News : కేవలం ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ విషాద సంఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు ప్రేమ్ సాగర్
మృతుడు ప్రేమ్ సాగర్

Warangal News : బిర్యానీ సెంటర్ వద్ద రూపాయి విషయంలో మొదలైన గొడవ ఓ యువకుడి ప్రాణం తీసింది. బిర్యానీ కోసం రూ.59 చెల్లించాల్సి ఉండగా.. ఒక రూపాయి అదనంగా రూ.60 ఫోన్ పే చేయడంతో గొడవ స్టార్ట్ కాగా.. ఒకరినొకరు నెట్టేసుకునే క్రమంలో తలకు దెబ్బ తగిలి యువకుడి ప్రాణాలు గాలిలో కలిశాయి.వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పీఎస్ పరిధి లేబర్ కాలనీ గాంధీ నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ గాంధీ నగర్ కు చెందిన ప్రేమ్ సాగర్(40) అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఆటో నడిపిన ఆయన రాత్రి సమయంలో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ సెంటర్ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో అరవింద్ అనే మరో యువకుడు కూడా బిర్యాని కోసం అక్కడికే వచ్చాడు. తనకు కావాల్సిన బిర్యానీ తీసుకున్న ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్, దానికి 59 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఫోన్ పే ద్వారా డబ్బులు పంపేందుకు ఫోన్ తీసిన ఆయన 60 రూపాయలు పంపాడు. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్… ఆటో డ్రైవర్‌ను ఎగతాళిగా కామెంట్స్ చేసాడు. ఇదే ఇద్దరి మధ్య నిప్పు రాజేసింది. తనను అలా ఎందుకు అనాల్సి వచ్చిందని ప్రేమ్ సాగర్ వాదనకు దిగగా.. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది.

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు…

ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయి క్షణికావేశంలో ఇద్దరు పిడుగులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు నెట్టేసుకున్నారు. దీంతో అరవింద్ ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ కు బలంగా నెట్టేయడంతో ఆయన కిందపడ్డాడు. 

కింద పడిన ప్రేమ్ సాగర్ తలకు పక్కనే ఉన్న రాయి బలంగా తాకింది. దీంతో ఆయన కదలిక లేకుండా అస్వస్థతకు గురి కావడంతో స్థానికులు వెంటనే అతన్ని గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా తలకు రాయి బలంగా తాకడంతో చిన్న మెదడు చిట్లి ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. 

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ప్రేమ్ సాగర్ డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇదిలావుంటే ప్రేమ్ సాగర్ మరణానికి కారణమైన అరవింద్ నేరుగా మిల్స్ కాలనీ పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయినట్టు తెలిసింది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner