Warangal Hotels: కుళ్లిన చికెన్.. బూజు పట్టిన కాయగూరలు, వరంగల్‌లో బడా హోటళ్లలో దారుణం
Warangal Hotels: ఆహార ప్రియులే టార్గెట్ గా వరంగల్ లో వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు జనాల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాయి. ఫుడ్ టేస్ట్ కోసం కెమికల్స్, కలర్స్ కలపడమే కాకుండా చికెట్, మటన్, ఫిష్ వంటి వాటిని రోజుల తరబడి స్టోర్ చేస్తూ.. కస్టమర్లకు వేడి చేసి అంటకడుతున్నాయి.
Warangal Hotels: కుళ్లిపోయిన చికెన్, మటన్ తో పాటు బూజు పట్టిన కూరగాయలు, పదుల సార్లు వాడిన నూనెలతో వంటలు చేస్తూ జనాల గుండెలకు చిల్లులు పెడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వరంగల్ నగరంలో బయట పడిన వాస్తవాలు ఇవి.
నిండా కెమికల్స్.. వంట సామగ్రికి ఫంగస్
వరంగల్ నగరంలో గురువారం సాయంత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే దారుణాలు వెలుగు చూశాయి. జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వరంగల్, హనుమకొండ సిటీలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా, చూస్తేనే వాంతులొచ్చే పరిస్థితులు కనిపించాయి.
మొదట హనుమకొండలోని అరణ్య, జంగల్ థీమ్ రెస్టారెంట్ లో సోదాలు చేయగా, రిఫ్రిజిరేటర్ లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సరైన ఉష్ణోగ్రతను మెయింటేన్ చేయకపోవడంతో పాటు ఫుడ్ గ్రేడ్ లేని ప్లాస్టిక్ కవర్లలో చికెన్, మటన్ స్టోర్ చేసినట్లు తేలింది. అంతేగాకుండా హానికరమైన కెమికల్స్ కలిపిన పన్నీరు, తుప్పు పట్టిన వంట పాత్రలతో పాటు బూజు పట్టిన కూరగాయలు దర్శమిచ్చాయి.
దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అరణ్య జంగిల్ రెస్టారెంట్ ఓనర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా రెస్టారెంట్ లో స్టోర్ చేసిన 26 కిలోల చికెన్ వెరైటీలను పారబోయడంతో పాటు సంబంధిత యజమానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం నోటీసులు కూడా జారీ చేశారు.
బూజుతో నిండిన చికెన్, ఫిష్
ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం బస్టాండ్ సమీపంలోని శ్రేయ హోటల్ లో తనిఖీ నిర్వహించింది. దీంతో చికెన్ కబాబ్స్, ఇతర వెరైటీలకు బూజు ఉండటంతో పాటు అవన్నీ అపరిశుభ్ర వాతావరణంలోనే స్టోర్ చేసి ఉన్నట్లు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న సదరు హోటల్ యాజమాన్యానికి ఎఫ్ఎస్ఎస్ఏ చట్టానికి సంబంధించిన నోటీసులను జారీ చేశారు.
సుమారు 11 కేజీల బూజు పట్టిన చికెన్, ఫిష్ టిక్క, బొద్దింకలు తిరుగుతున్న ఇడ్లీ పిండి, బెల్లం నిల్వలను పారబోశారు. చుట్టూ అపరిశుభ్ర పరిసరాలు, ఆహార పదార్థాల్లో క్వాలిటీ లేకపోవడంతో సంబంధిత యజమానులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల ఆరోగ్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.
ఎన్ని వంటలైనా అదే నూనె
హనుమకొండ చౌరస్తాలోని ప్రముఖ హోటల్ అయిన అశోక హోటల్( కాకతీయ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్) ను తనిఖీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులే షాక్ అయ్యారు. పేరుమోసిన హోటల్ కావడంతో అంతా సవ్యంగానే ఉంటుందని భావించినప్పటికీ తనిఖీల్లో మాత్రం చాలా ప్రమాదకర విషయాలు బయట పడ్డాయి.
రుచి కోసం హానికరమైన కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలతో పాటు 10 లీటర్ల మేర మళ్లీ మళ్లీ కాల్చిన రీ యూజ్డ్ నూనెను గుర్తించారు. అంతేకాకుండా కాలం చెల్లిన మసాలాలు, సాస్ బాటిల్స్ ను గుర్తించి ధ్వంసం చేశారు. బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన రూ.5,500 విలువ గల 17 నూడుల్స్ ప్యాకెట్లను, 28 సోంపు ప్యాకెట్లను సీజ్ చేశారు.
వాటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు కూడా తరలించారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో నిలువ ఉంచిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్ నివేదికల ఆధారంగా సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. హోటల్ యాజమాన్యాలకు ఇంప్రూవ్మెంట్ నోటీస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం