Hyderabad : గ్రూప్ 2,3 పోస్టులను పెంచాలి, పరీక్షలను వాయిదా వేయాలి - అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ ఆందోళన
Unemployed Youth Protest at Ashok Nagar : హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో నిరుద్యోగులు భారీ ఆందోళనకు దిగారు. గ్రూప్ 2,3 పోస్టులను పెంచటంతో పాటు డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Unemployed Youth Protest at Ashok Nagar : అశోక్ నగర్ నిరుద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలని… గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు 1: 50 నిష్పత్తిలో కాకుండా… 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలని నినాదాలు చేశారు. డీఎస్సీ పరీక్షలను కూడా తక్షణమే వాయిదా వేయాలని కోరారు.
చిక్కడపల్లి చౌరాస్తా నుంచి అశోక్ నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బైఠాయించి… భారీ ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
నిరుద్యోగుల మొరను వినండి - హరీశ్ రావు
నిరుద్యోగుల ఆందోళనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. “గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి” అని సూచించారు.
పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుందని హరీశ్ రావు అన్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా తాము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.