Khairatabad Ganesh : గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి బడా గణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సమయంలో కొందరు పోకిరీలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా 285 మంది పట్టుబడ్డారు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పోకిరీలు భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అనుచితంగా ప్రవర్తించిన 285 మందిని.. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల్లోనే 285 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో జరుగుతున్న ఉత్సవాల్లోనూ కొందరిని అదుపులోకి తీసుకున్నారు. భక్తుల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని షీ టీమ్స్‌కు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో షీ టీమ్స్ నిఘాపెట్టి పోకిరీల ఆటకట్టించారు. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు వివరించారు. ఇలాంటి దుష్ప్రవర్తనను సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. వేధింపులు లేదా ఆటపట్టింపులకు సంబంధించిన ఏదైనా సంఘటనలు జరిగితే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
అనుచిత ప్రవర్తనకు వ్యతిరేకంగా గళం విప్పాలని.. వెంటనే తమకు రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ పోలీసులు పౌరులను కోరారు. తెలంగాణ పోలీసు విభాగంలోని షీ టీమ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నాయని పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడానికి నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నాయని అధికారులు చెప్పారు. ఈవ్-టీజర్‌లు, స్టాకర్లు, వేధించేవారిని అరెస్టు చేయడానికి మఫ్టీలో తిరుగుతున్నారని స్పష్టం చేశారు. ప్రధానంగా రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో షీటీమ్స్ అలర్ట్‌గా ఉంటాయని చెప్పారు.
రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. 'మీ ప్రవర్తనను మా షీ టీమ్స్ రికార్డ్ చేస్తున్నాయి. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో మీరు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినా చర్యలు తప్పవు. మీ దురుద్దేశాలను చంపుకోవడమే మిమ్మల్ని జైలులో పెట్టకుండా కాపాడే ఏకైక మంత్రం' అని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.