Rythu Bandhu 6th Day: కొనసాగుతున్న రైతుబంధు సంబురం.. 6వ రోజు రూ.262.60 కోట్లు జమ-262 crores credited in farmers accounts on sixth day under 10th phase of telangana rythu bandhu scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Bandhu 6th Day: కొనసాగుతున్న రైతుబంధు సంబురం.. 6వ రోజు రూ.262.60 కోట్లు జమ

Rythu Bandhu 6th Day: కొనసాగుతున్న రైతుబంధు సంబురం.. 6వ రోజు రూ.262.60 కోట్లు జమ

Thiru Chilukuri HT Telugu
Jan 03, 2023 07:15 PM IST

Rythu Bandhu 6th Day: రైతుబంధు పథకం కింద పదో విడత పెట్టుబడి సాయం రైతులకి అందుతోంది. 6వ రోజు రూ.262.60 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.

రైతుబంధు సంబురం
రైతుబంధు సంబురం (facebook)

Rythu Bandhu 6th Day: రాష్ట్రంలో రైతుబంధు సంబురం కొనసాగుతోంది. ఈ పథకం కింద పదో విడత నిధులు రైతుల ఖాతాల్లోకి డిపాజిట్ అవుతున్నాయి. డిసెంబర్ 28న యాసంగి పెట్టుబడి సాయం మొదలవగా.. మొదటి 5 రోజుల్లో 70.09 లక్షల ఎకరాలకు గాను.... 49.17 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,504 కోట్లు జమ చేశారు. 6వ రోజు.. లక్ష 49,970 మంది రైతులకు రూ.262.60 కోట్లు అందాయి. ఆరో రోజు.. 5 లక్షల 25 వేల 200 ఎకరాలకు పెట్టుబడి సాయం నిధులు జమయ్యాయి. దీంతో... ఆరు రోజుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 51 లక్షల 50,958 మంది రైతులకు రూ.3767.35 కోట్లు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధుల జమ ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు 1 ఎకరం వరకు ఉన్న 22.45 లక్షల మంది రైతులకు వారి ఖాతాల్లో రూ. 758 కోట్లు జమ చేసిన అధికారులు.. 2వ రోజు.. 2 ఎకరాల వరకు ఉన్న 15.96 లక్షల మంది రైతుల అకౌంట్లలో.. రూ. 1,218.38 కోట్లు డిపాజిట్ చేశారు.

3వ రోజు.. రూ. 687.89 కోట్లు కర్షకుల ఖాతాల్లో జమ చేశారు. 13 లక్షలా 75 వేల 786 ఎకరాలకు గాను.. 5.49 లక్షల మంది రైతులు .. రైతుబంధు నిధులు అందుకున్నారు.

4వ రోజు.. 4.57 లక్షల మంది రైతులకి చెందిన 11.50 లక్షల ఎకరాలకు గాను.. రూ. 575. 09 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

5వ రోజు ల‌క్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో రూ. 265.18 కోట్ల న‌గ‌దు జ‌మ అయింది. 5 లక్షల 30 వేల 371 ఎకరాలకు నిధులు అందాయి.

6వ రోజైన మంగళవారం... లక్ష 49,970 మంది రైతులకు రూ.262.60 కోట్లు అందాయి. ఆరో రోజు.... 5 లక్షల 25 వేల 200 ఎకరాలకు పెట్టుబడి సాయం నిధులు జమయ్యాయి.

ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... సీఎం కేసీఆర్ ఆలోచనలు దేశానికి అత్యవసరమని... దేశమంతా తెలంగాణ పథకాలు అమలు కావాలని అన్నారు. కేంద్రంలోని పాలకులపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలపై సమాజంలో చర్చ మొదలయిందని.. రైతాంగానికి సాగునీరు, ఉచిత కరెంటుపై పాలకుల వైఖరి మారాలని చెప్పారు. ఉచితం అంటే అనుచితంగా మాట్లాడుతున్నారన్న మంత్రి... అన్నం పెట్టే అన్నదాతలను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని.. కేసీఆర్ వినూత్న పథకాలతో పటిష్ఠం చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయకున్నా కరెంటు, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలు చేస్తున్నారని... దేశమంతా ఈ పథకాలు అమలైతే దేశ వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.