Yuvraj Singh | టెస్ట్ సారథిగా ధోనీ లాంటివాడు కావాలి.. అందుకు అతడే కరెక్ట్ : యువీ-yuvraj singh says rishabh pant is perfect suitable as test captain ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Yuvraj Singh | టెస్ట్ సారథిగా ధోనీ లాంటివాడు కావాలి.. అందుకు అతడే కరెక్ట్ : యువీ

Yuvraj Singh | టెస్ట్ సారథిగా ధోనీ లాంటివాడు కావాలి.. అందుకు అతడే కరెక్ట్ : యువీ

Maragani Govardhan HT Telugu
Apr 28, 2022 05:06 PM IST

టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్.. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా రిషభ్ పంత్ సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తును దృష్టింలో ఉంచుకుని యువకుడికి కెప్టెన్‌గా అవకాశమివ్వాలని స్పష్టం చేశాడు.

<p>యువరాజ్ సింగ్&nbsp;</p>
యువరాజ్ సింగ్ (Twitter)

టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి గతేడాది విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో భారత ఓపెనర్ రోహిత్ శర్మకు భారత క్రికెట్ మండలి(BCCI) పగ్గాలు అప్పగించింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించింది. టెస్టు కెప్టెన్సీనే కాకుండా రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా టెస్టు కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విభిన్నంగా అభిప్రాయపడ్డాడు. దీర్ఘకాల ఫార్మాట్‌కు సంబంధించి కెప్టెన్‌ను సిద్ధం చేయాలని, మహీ ఏ విధంగా అయితే కెప్టెన్ అయ్యాడో అదే విధంగా సారథిని నియమించాలని తెలిపాడు.

"కీపర్ ఎల్లప్పుడు మంచి ఆలోచనను కలిగి ఉంటాడు. ఎందుకంటే అతడు ఎప్పుడూ మైదానంలో అత్యుత్తమ వీక్షణనను కలిగి ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువకుడిని కెప్టెన్‌గా ఎంచుకోవాలి. అతడి నుంచి అద్భుతాలు ఆశించకుండా.. ఓ ఆరు నెలలు లేదా ఓ ఏడాది సమయం ఇవ్వాలి. ఏ పనికైనా యువకుడిని ఆశ్రయించడం ఉత్తమమని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం రిషభ్ పంత్ మంచి ఆప్షన్. అతడు టెస్టు జట్టుకు నాయకత్వం వహించేందుకు సరైన వ్యక్తి. ఆ వయస్సులో నేను, విరాట్ అంత మెచ్యూరిటీని కలిగి లేం. కానీ పంత్ మాత్రం కాలంతో పాటు పరిణితి చెందుతున్నాడు. సపోర్ట్ స్టాఫ్ దీని గురించి ఆలోచిస్తారో లేదో తెలియదు." అని యువరాజ్ సింగ్ తన మనోగతాన్ని బయటపెట్టాడు.

అంతేకాకుండా పంత్‌ను యువీ భవిష్యత్ లెజెండ్ అని అభివర్ణించాడు. అతడు టెస్టుల్లో ఇప్పుటికే నాలుగు శతకాలు చేశాడని, అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎదిగాడని అన్నాడు. 2018లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి పంత్ 30 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 1920 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో పంత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 159.

 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్