Lata Mangeshkar | టీమ్​ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్​ ఉపవాసం ఉన్న వేళ..-when avid cricket fan lata mangeskhar fasted for india s victory during 2011 wc semis ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lata Mangeshkar | టీమ్​ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్​ ఉపవాసం ఉన్న వేళ..

Lata Mangeshkar | టీమ్​ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్​ ఉపవాసం ఉన్న వేళ..

Sharath Chitturi HT Telugu
Feb 06, 2022 04:20 PM IST

Lata Mangeshkar news | కోట్లాది మంది భారతీయులకు.. క్రికెట్​ అంటే ప్రాణం. టీమ్​ఇండియా గెలుపును.. తమ విజయం అనుకునే వారెందరో. ఓడితే బాధపడే వారూ చాలా మంది ఉన్నారు. దేశంలోని క్రికెట్​ ప్రేమికుల్లో లతా మంగేష్కర్​ ఒకరు. జట్టు గెలవాలని..ఆమె ఉపవాసం ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్​ పట్ల తనకున్న ప్రేమను ఎన్నోసార్లు బయటపెట్టారు లత. ఓసారి ఆ జ్ఞపకాలను నెమరవేసుకుందాం..

<p>టీమ్​ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్​ ఉపవాసం ఉన్న వేళ..</p>
టీమ్​ఇండియా గెలుపు కోసం లతా మంగేష్కర్​ ఉపవాసం ఉన్న వేళ.. (REUTERS)

Lata Mangeshkar news today | 2011 ప్రపంచకప్​.. భారత్​ వశమైంది. కానీ అంతకన్నా ముందు సెమీఫైనల్​లో పాకిస్థాన్​తో పోటీపడింది టీమ్​ఇండియా. పాక్​తో మ్యాచ్​ అంటే.. అభిమానుల్లో సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ప్రపంచకప్​ సెమీస్​ అంటే.. తీవ్రస్థాయి ఉత్కంఠ కచ్చింగా ఉంటుంది.

ఆరోజున.. కోట్లాది మంది భారతీయులు, టీమ్​ఇండియా గెలవాలని ప్రత్యేక పూజలు చేశారు. కొందరు ఉపవాసాలు కూడా ఉన్నారు. వారిలో లతా మంగేష్కర్​ కూడా ఒకరు. కొన్నేళ్ల క్రితం ఈ విషయాన్ని లత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

"టీమ్​ఇండియా ఆడుతుంటే.. ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఇలా చేస్తే, అలా చేస్తే.. జట్టు గెలిచేస్తుందని అనుకుంటారు. ఆరోజు నేను మ్యాచ్​ మొత్తానికి ఉపవాసం ఉన్నాను. తినలేదు, మంచినీరు కూడా తాగలేదు. టీమ్​ఇండియా గెలవాలని నేను బలంగా ప్రార్థించాను. జట్టు గెలిచిన తర్వాతే.. మేమందరం రాత్రి భోజనం చేశాము," అని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

లార్డ్స్​లో లత..

1983 ప్రపంచకప్​ గెలుపు భారత్​లో క్రికెట్​ రూపురేఖలను మార్చేసింది. నాటి విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం. లార్డ్స్​ వేదికగా కపిల్​ దేవ్​ జట్టు.. మ్యాచ్​ను దక్కించుకున్న ఆ అద్భుతమైన క్షణాలను లతా మంగేష్కర్​ అక్కడే ఉండి చూశారు.

"ఓ సంగీత కార్యక్రమం కోసం నేను లండన్​కు వెళ్లాను. అప్పుడే సెమీఫైనల్​లో ఇంగ్లాండ్​పై మన జట్టు గెలిచింది. ఇక ఫైనల్​కి ముందు.. కపిల్​ దేవ జట్టును.. నేను ఉండే హోటల్​కు డిన్నర్​ కోసం పిలిచాను. వారికి శుభాకాంక్షలు తెలిపాను. ఆ మ్యాచ్​ ప్రత్యక్షంగా చూడాలని నాకు చాలా అనిపించింది. వెళ్లి చూసేశాను," అని లత పేర్కొన్నారు.

'సచిన్​ టెండుల్కర్​.. అంటే ఇష్టం'

Lata Mangeshkar Sachin Tendulkar | క్రికెటర్లలో సచిన్​ టెండుల్కర్​ అంటే లతా మంగేష్కర్​కు చాలా ఇష్టం. సచిన్​ను అమె ఓ కొడుకులాగా చూసుకునేవారు.

"సచిన్​.. నన్ను తల్లిగా చూస్తాడు. ఓ తల్లి లాగా నేను సచిన్​ కోసం ప్రార్థిస్తాను. సచిన్​ నన్ను 'ఆయీ(అమ్మా)' అని తొలిసారి పిలిచిన క్షణాలను నేను మర్చిపోలేను. సచిన్​ లాంటి తనయుడు నాకు ఉండటం ఎంతో సంతోషంగా ఉంది," అని లత ఓ సందర్భంలో తెలిపారు.

సచిన్​ కూడా లత పట్ల తల్లిభావనతో ఉంటాడు. జీవితంలో ఒత్తిడికి గురైనప్పుడు.. లత పాటలు వింటే అంతా మాయమైపోతుందని ఎన్నో సందర్భాల్లో మాస్టర్​ బ్లాస్టర్​ వెల్లడించాడు.

కొవిడ్​ సోకడంతో జనవరి 8న ముంబయిలోని బ్రీచ్​ క్యాడీ ఆసుపత్రిలో చేరారు లతా మంగేష్కర్​. కొన్ని రోజుల పాటు వెంటిలేటర్​పై ఆమెకు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు. కానీ ఆమె పరిస్థితి విషమించినట్టు శనివారం తెలిపారు. చివరికి.. వెంటిలేటర్​పై చికిత్స పొందుతూ.. 92ఏళ్ల లతా మంగేష్కర్​ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

లతా మంగేష్కర్​కు టీమ్​ఇండియా నివాళులర్పించింది. వెస్టిండీస్​తో జరుగుతున్న తొలి వన్డేలో.. భారత ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి మైదానంలోకి దిగారు. లత ఆత్మకు శాంతిచేకూరాలని.. మౌనం పాటించారు.

Whats_app_banner

సంబంధిత కథనం