Virat Kohli Out: బంతిని అంచనా వేయలేక కోహ్లీ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్
Virat Kohli Out: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో విఫలమయ్యాడు. లంక బౌలర్ లహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
Virat Kohli Out: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టారు. ముఖ్యంగా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ సహా గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లహిరు కుమార బౌలింగులో బంతిని సరిగ్గా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు మన రన్నింగ్ మెషిన్.
ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో లహిరు కుమార వేసిన బంతిని కోహ్లీ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి వికెట్లను గిరాటేసింది. ఫలితంగా విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లో 113 పరుగులతో అద్భుత శతకాన్ని తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.
216 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం 24.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(23), హార్దిక్ పాండ్య(19) ఉన్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 210 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించడంతో ప్రత్యర్థి స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో నువనిడు ఫెర్నాండో(50) అర్ధశతకం మినహా.. మిగిలిన వార్లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లతో రాణించగా.. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
సంబంధిత కథనం